వ్యవహరిస్తే ఎలా ఉంటుందో చూపదలచాడు మనకు వాల్మీకి. అది నటన అని తెలియక నిజమేనని భ్రమపడే తోడి జీవుల వ్యవహారమెలా ఉంటుందో కూడా చూపదలచాడు. కనుకనే రాముడు సీతా వియోగం తట్టుకోలేక ఉన్మత్తుడులాగా ప్రవర్తించటం, అది చూచి తట్టుకోలేక సుగ్రీవాదులాయనను ఓదార్చటం రెండూ అసత్యాలే. లోకసత్యాన్ని ధ్వనింపజేసే కావ్యసంకేతాలు. లోకంలో ఒక కాముకుడైన మానవుడు ప్రాణాధికంగా తాను ప్రేమించే ప్రియురాలు తనకు దూరమయినప్పుడెలా బాధపడుతాడు. ఎలా స్పందిస్తాడు. ఎంతగా ఆక్రందిస్తాడు. ఈ ప్రేమ రహస్యం మనకు తెలపాలి. తెలపాలంటే తనకది సహజంగా లేకున్నా ఉన్నట్టు చూపాలి. ఇది పరమాత్మ మానవ స్వభావాన్ని మనస్తత్త్వాన్ని అనుకరించి లోకానికి ప్రదర్శించే తీరు.
అయితే ఈ ప్రదర్శన దేనికి. ఎందుకు చేసినట్టిది. ఇలాంటి వ్యసనపరత్వం స్త్రీ పురుషులకు పనికిరాదని భంగ్యంతరంగా చాటటానికి. అందుకే మరలా లక్ష్మణుడి చేత సుగ్రీవుడిచేత మృదువుగా కఠినంగా హితోక్తులు పలికించటం. ఒక వ్యసనానికి గురి అయి బేలగా ప్రవర్తించినప్పుడు మనకంటే చిన్నవాళ్ల దగ్గర కూడా మనం పలచనయిపోతాము. వాళ్లచేత కూడా చెప్పించుకొనే దురవస్థ మన కేర్పడగలదు సుమా అని లోకాన్ని చాటుగా హెచ్చరించటమిది. అందుచేత శూర్పణఖతో ఆడిన తన చతురోక్తుల ద్వారా చేష్టలద్వారా కామమోహితత్వం పనికిరాదని ఎలా ప్రబోధించాడో పరమాత్మ అలాగే తన స్వవిషయంలో కూడా అలాంటి వ్యవహారాన్నే అభినయించి తద్వారా కూడా ప్రబోధించాడు. అదే వాల్మీకి మనకు తనకావ్యం ద్వారా అందిస్తున్నాడు. కాబట్టి ఇదంతా రాముడు చూపిన కాముకాభినయమే గాని అనుభవం కాదని గ్రహించాలి. ఒక నటుడి నటనలాంటి దిది. ఒక నటుడు దుష్యంతుడి వేషం వేసుకొనివచ్చి రంగస్థలం మీద శకుంతలా వియోగవేదనంతా అభినయించి చూపుతాడు. వాస్తవమేనని ప్రేక్షకులు భ్రమించేంతగా అభినయిస్తాడు. అనుభవం లేకున్నా అభినయిస్తాడు. అనుభవం చూచు ప్రేక్షకులది. వాడిదిగాదు. అలాగే ఈ కామవృత్తానుభవం రాముడిది గాదు. ఆయన ఆత్మారాముడు. అభినయమే గాని అనుభవం కాదాయనది. పోతే ఇక ఎవరిదీ అనుభవం. అభినయమని తెలియక భ్రమించే సుగ్రీవాదుల స్థానంలో ఉన్న సాపాటు రాములలాంటి మనది.
Page 187