#


Index

ధర్మ సూక్ష్మములు

-నచేయం సదృశీతవ ఇది వికృత విరూప ఇలాంటిది నీకు తగినది కాదు. ఇదుగో దీన్ని నీ తమ్ముడితో సహా ఒక్క క్షణంలో మ్రింగి పారేస్తాను. ఆ తరువాత మనమక్కడా ఇక్కడా హాయిగా తిరగవచ్చు. అంటుంది.

  ఇదుగో ఇక్కడే వచ్చింది చిక్కు, అంతవరకూ బాగా మాట్లాడిందిప్పుడీ అసందర్భపు మాటలేమిటి ? ఆయన చెబుతున్నాడొక ప్రక్క ఈవిడ నా భార్య ఇతడు నా తమ్ముడని. భార్య అన్నప్పుడు పెండ్లయిందనే గదా. ఫెండ్లయినవాడిని నన్ను పెండ్లాడమనటమేమిటి. పైగా ఆయన భార్యను పట్టుకొని విరూప వికృత అనటమేమిటి? ఆ సీత తన కంటికి విరూపగా కనపడుతున్నదా ? నిజానికి విరూప తాను. ఆవిడకాదు. ఆవిడ సురూపే. సురూపను విరూప అని వర్ణించటమేమిటి ? ఇదొక అబద్ధం. పైగా ఆవిడను మింగుతాను చేస్తానని బెదరించటమేమిటి ? ఇదొక అహంకారం. దీనికి కారణం దాని కామమోహితత్వమేనని తెలుసు రాముడికి. అది ఇన్ని అవతవక ప్రేలాపనలకు దారి తీసిందని గ్రహించాడు. నవ్వు వచ్చింది రాముడికి. ప్రహస్య అంటాడు వాల్మీకి. మందహాసం చేశాడట. ఇదుగో ఈ మందహాసమే మహామోసమని చెప్పాను కృష్ణుడి విషయంలో అది ఇప్పుడు రాముడి విషయంలో కూడా. ఏమిటీ మందహాసాని కర్ణం. ఓసి పిచ్చిదానా ! నీవే నిజాన్ని కప్పిపుచ్చి నన్ను బేలు పుచ్చటాని కబద్దమాడితే నేను మాత్రమేమి తక్కువ చదివానా ఆ మాటకు వస్తే నేనూ ఆడగలను సుమా అబద్ధం. కానిదానివల్ల సుఖం లేకపోగా లేని ముప్పు నెత్తికి తెచ్చుకోవటమే అది. అందుచేత అనవసరం. ఎవరినో మోసపుస్తున్నానని అబద్ధాలాడి పాడయిపోరాదని హెచ్చరించటానికే జీవుల అబద్ధాన్ని అనుకరిస్తూ చేసినదీ మందహాసం. మోసానికి మోసమే సమాధానం. అంతవరకూ ఋజుబుద్ధితో మాట్లాడిన రాముడిక ఋజుబుద్ధి దీనిపట్ల పనికిరాదని భావించాడు. అది తాను కురూపయినా సీతను కురూప అంటున్నది. ఎంత అబద్ధం. పైగా ఆవిడను మింగుతానంటున్నది. నిజంగా అంత పని చేసినా చేయవచ్చు. మీదుమిక్కిలి ఎక్కడో దూరంగా నిలుచొని అమాయికంగా చూస్తున్న లక్ష్మణుణ్ణి కూడా మింగుతానని బెదరిస్తున్నది.

  దీనికంతా మూలం దాని కామోద్రేకమే గదా అని గ్రహించాడు స్వామి. కామమెక్కడ ఉన్నా సహించడాయన. తన తండ్రి దశరథుణ్ణి క్షమించలేదా విషయంలో.

Page 183

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు