#


Index

ధర్మ సూక్ష్మములు

అనుకరించి వేళాకోళం చేయటం అలాగే ఒకానొక సందర్భంలో ఆవేశం పట్టలేక పెద్దలను దూషించాలనిపిస్తుంది ఏ మానవుడికైనా. కాని అది సత్పురుషుడి లక్షణం కాదని వ్యంగ్యంగా లోకానికి చాటటం. నోటికాడికి వచ్చిన ఐశ్వర్యం దక్కకుండా పోతే దానికోసం ఏకారుతాడే మానవుడైనా, ఎంత సాహసమైనా చేయాలనిపిస్తుంది. కాని అది కూడా ధీరోదాత్తుడి లక్షణం కాదని సూచించటం. ఇలా అర్ధం చేసుకొని సమాధానం చెప్పుకోవాలిగాని భావుకుడైనవాడు, పైపైన చూచి అది హేయమిది నీచమని ఆక్షేపించరాదు. అయితే ఇలాగే చెప్పుకోవాలని మీరెలా శాసించగలరు. ఏమో ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తే అలాగే గ్రహించాలని ఎందుకనుకోరాదని మరలా ఎదురు ప్రశ్న చేయవచ్చు. దానికొక్కటే జవాబు. అలాగే గ్రహించేట్టయితే పాత్ర చిత్రణలో పూర్వాపరాలకు పరస్పర వైరుధ్యమేర్పడుతుంది. మొదట నిస్స్వార్థంగా కనపడిన పాత్ర ఆ వెంటనే పరమ స్వార్ధపరుడుగా మారిందని చెప్పవలసి వస్తుంది. మొదట పెద్దలంటే భక్తిప్రపత్తులు చూపినవాడు వెంటనే నిర్లక్ష్యంగా తృణీకరించి నట్టవుతుంది. రెంటిలో ఏదో ఒకటి ఆ వ్యక్తి స్వభావం కావాలి గాని రెండూ కావటానికి లేదు. ఎందుకంటే అవి అన్యోన్య విరుద్ధం. ఒక్కచోట సమావేశపడలేవు. పోనీ రెండవదే ఆ వ్యక్తి స్వభావమేమో మొదటిది కాదనుకొందామనుకొంటే ఆ పక్షంలో వాల్మీకి రామాయణమిక వ్రాయనక్కరలేదు. మనబోటి వాళ్లం చదవనక్కర లేదు. ఒక స్వార్ధపరుడు అయిన వాణ్ణి శాశ్వతంగా నిలపవలసిన ఒక ఇతిహాసానికి కథానాయకుణ్ణి చేసి సుఖమేమిటి ? అతణ్ణి ఆదర్శంగా పెట్టుకొని మనం మన జీవితాలను ఏమి బాగు చేసుకోవాలని. కాబట్టి మొదటిదే నాయకుడి స్వభావం. రెండవది వివిధ మానవ స్వభావాలను అనుకరిస్తూ అట్టి అవగుణాలను అధిగమించి బాగుపడండని భంగ్యంతరంగా మానవులకు చేసే హితోపదేశం. ఇదే సరియైన సమాధానం దీనికి.

  ఇక రెండవ ఆక్షేపణ అరణ్యకాండలో శూర్పణఖా పరాభవఘట్టాన్ని గురించి. శూర్పణఖను పరాభవించి నందుకుగాదు. అది అనుచితంగా ప్రవర్తించినందుకు పరాభవించవలసిందే. తప్పులేదు. కాని అది ఒక రాక్షసి, పనికిమాలినదని తెలిసి కూడా దానితో పరియాచక మాడటం పొరబాటు. ఊరక హాస్యమాడటమే గాక అబద్ధమాడటమంతకన్నా తప్పు. తానొక ధీరోదాత్తుడైన రాజపుత్రుడు. లోకంలో

Page 180

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు