ఏమయిపోతుందో అని కళ్లనీళ్లు పెట్టుకొంటాడు. చూడండి ఎంత నటనో ? ఆ పౌరుషవచనా లేమిటి? ఈ పిఱికితనమేమిటి ? అంతా నటనే. కృష్ణుడిదీ నటనే. రాముడిదీ నటనే. అయితే ఆయన నటన బయటపడి చేస్తే ఈయన బయటపడకుండా చేస్తాడు. అది ఇంకా మోసం. తనకు రాజ్యంమీద ఆశ ఉన్నట్టు అయినా మాటకోసం వదులుకొని వచ్చినట్టు ఒక నటన. తండ్రే చెప్పవలెనా తల్లివి నీవు చెప్పినా అడవికి వెళ్లనా ? అని అప్పుడని ఇప్పుడా తల్లి చూడు ఎంత క్షుద్ర స్వభావో అనటం, ఇది ఒక నటన. కోపం వస్తే ఎంతపనైనా చేయగలను అయినా ఎందుకులే అంత పని అనటం ఇంకొక నటన. ఇదంతా అర్థం చేసుకొంటాడా ? లేదా చేసుకొంటే ఏమంటాడో తమ్ముడు చూద్దామనుకోవటం మరొక నటన. వాడిదంతా కొంత వరకు భేదించే ఇంతపని చేయగల సమర్థుడీయన అయోధ్యలో జరగబోయే అనర్ధాలకు ప్రతీకారం చేయలేడా నేను వెళ్లి చేసేదేముందని నేను వెళ్లను గాక వెళ్లనంటాడు. పూర్తిగా భేదించలేకనే ఆయన కల్లబొల్లి ఏడుపులు నిజమేననుకొని ఓదార్చబోతాడు.
ఇక్కడే రామలీల అర్ధం చేసుకోవటం మహాకష్టమని మనవి చేసింది నేను. అన్నీ తెలుసు ననుకోవటానికి లేదు. అసలు తెలియదనుకోవటానికీ లేదు. సర్వజ్ఞుడాయనకు తెలియక పోవటమేమిటి ? తెలియక సతమతమవుతున్నది అల్పజ్ఞులమైన మనమే. తెలిసీ తెలియక లేని పోని విమర్శలు సాగిస్తుంటారు. లక్ష్మణుడికేమో గానిమనకు పెడుతున్నాడు రాముడు పరీక్ష ఏడిచినట్టు తాను నటిస్తూ మనలను నిజంగా ఏడిపిస్తున్నాడు. అది ఏడుపుగాదు, పాడూగాదు. మానవ స్వభావానుకరణమది. ఏయే ఘట్టాలలో ఒక మానవుడెలా నడుచుకొంటాడో ఎలా స్పందిస్తాడో ఎలా భావిస్తాడో మాట్లాడుతాడో ఆ లక్షణాలు తనకు సహజంగా లేకపోయినా ఆరోపించుకొని భగవానుడు లోకానికి ప్రదర్శించే బ్రహ్మాండమైన నాటకమిది. నాటకమేగాని వాస్తవం కాదది. వాస్తవమేననిపించేంత నాటకం. నిత్యమూ తనతో మెలిగే లక్ష్మణుడికే అంతుపట్టలేదది నాటకమని. పట్టకనే ఏడిస్తే అది నిజమైన ఏడుపని కన్నీరు తుడవబోతాడు. బుజ్జగిస్తాడు. ధైర్యం చెబుతాడు. తల్లిదండ్రులను అతని ఎదుట తూలనాడటం నిజంగా తూలనాడటం కాదు. అంతకు ముందు అయోధ్యలో అలా ఆవేశంతో ప్రవర్తించిన లక్ష్మణుడి మాటనూ, చేష్టనూ
Page 179