అనాథుడూ, వృద్ధుడూ, నన్ను దూరం చేసుకొన్నాడు. కైకేయి చేతులలో కీలు బొమ్మ అయ్యాడు. ఏమి చేయగలడు పాప మారాజు. అసలు నేననుకొంటాను దశరథుడి వినాశానికి, నాప్రవాసానికి, భరతుడికి రాజ్యం కట్టపెట్టడానికి, సంప్రాప్తమయింది ఆ తల్లి కైకేయి.
చూచారా. ఎలాంటి మాటలో ఇవి. ధర్మం పురుషాకృతి చెంది అవతరించిందని కితాబు గడించిన శ్రీరాముడనవలసిన మాటలా ఇవి. లక్ష్మణుడా గ్రహించినా నోరు మూయించినవాడు, కౌసల్య అనబోయినా కాదన్నవాడు. తరువాత భరతుడు తల్లిని తిట్టిపోసినా నివారించినవాడు. ఇలాగేనా మాట్లాడవలసింది. అప్పటికి పదిమందిలో ధర్మాత్ముడనిపించుకోవాలని ఆడిన నాటకమే గాని లోపల ఆత్మవంచన చేసుకొనే వాడనిపించటం లేదా రాముడు. ఇలా లోపల ఒకటి బయట ఒకటిగా వ్యవహరించే వాడు ఉత్తమ ధర్మపరాయణుడనే గౌరవానికి పాత్రుడు ఎలా కాగలడని ప్రశ్న.
పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. నిజమే. కాని ఆపాతతః గాక కొంచెం లోతుకు దిగి చూడవలసిన విషయమిది. అలా చూస్తే తెలుస్తుంది మనకిందులో ఉండే ధర్మ సూక్ష్మమేమిటో రాముడు కేవలం మానవమాత్రుడు కాడు. ధర్మ సంస్థాపన కోస మవతరించిన పరమాత్మ. ధర్మాన్ని తాను ఆచరిస్తూ పదిమంది చేత ఆచరింపజేయవలసిన వాడాయన. అలా ఆచరించకపోయినా అందులో ఏవైనా అవకతవకలు చేసినాక్షమించడు. వాణ్ణి శిక్షించి మంచి మార్గానికి త్రిప్పటమే ఆయన కర్తవ్యం. దానికీతరం కాకపోతే ఆయన నిజమైన శిక్షకు వాడు గురికాక తప్పదు. తాను గురుజనంపట్ల శిష్య ధర్మం పాటిస్తూ గురుధర్మం పాటించని పరశురాముణ్ణి అలాగే గదా శిక్షించాడు. అంతేకాదు. తాను తాపసుల యెడ క్షత్ర ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని ఉల్లంఘించిన మారీచుణ్ణి మరలా శిక్షించాడు. మిత్రధర్మాన్ని తాను పాటించినట్లు సుగ్రీవుడు పాటించలేదని అతణ్ణి శిక్షించబోయాడు. స్వామి ధర్మం పాటిస్తూ భృత్యధర్మం పాటించలేదని సముద్రుడి మీద బాణం ప్రయోగించాడు. అలాగే వీర ధర్మం పాటించని రావణుణ్ణి మట్టుబెట్టాడు. రాజధర్మం తాను తప్పనివాడవుతూ ప్రజలు తమ ధర్మం తప్పితే మరలా ఆగ్రహం చూపాడు. అదే శంబూకుణ్ణి వధించటం ఇలా తాను ధర్మం పాటించటం వరకే గాదు. ఎవరి ధర్మం వారు పాటించకపోయినా మన్నించడు. వారి వారికి తగిన శిక్ష విధిస్తూనే
Page 174