#


Index

ధర్మపాలనము

మభిషేక్ష్యామి అంటాడు. ప్రజలందరూ నిరపవాదంగా ఎవరని కోరుతారో వాడే రాజు నిజానికి. వంశ పారంపర్యంగా సంక్రమించిందీ నిరంకుశంగా చేజిక్కించు కున్నది అది రాజ్యము కాదు. వాడు రాజు కాదు. తాత్కాలికంగా పైకి వచ్చినా నిలిచేది కాదది. ఈ ప్రజాస్వామిక వ్యవస్థ ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉందనేందుకిదే మనకు దాఖలా. రామాయణం అయోధ్యాకాండలో కచ్చిత్సర్గ అని ఒక అధ్యాయముంది. అది భరతుడు రాముణ్ణి తోడ్కొని పోవటాని కరణ్యానికి వచ్చినప్పుడాయనతో రాముడు చేసిన సంవాదం. కచ్చిత్తంటే ఏమిటి ఎలా ఉందని అర్ధం. ఒక 60, 70 శ్లోకాలు ఈ కచ్చి చ్ఛబ్దంతో మొదలైనవి కనిపిస్తాయందులో మనకు. ఇవన్నీ రాజనీతికి సంబంధించిన అతిరహస్యాలు, ధర్మసూక్ష్మాలు, రాముడి రాజనీతి ప్రావీణ్యమంతా ఈ ప్రశ్న పరంపరలో పదహారు కళలతో సాక్షాత్కరిస్తుంది.

  పోతే కిష్కింధలో వాలి నేలగూలి తనతో నిష్టుర మాడినప్పుడతనికిచ్చిన సమాధాన పరంపరలో కూడా ఎంతో రాజనీతి దాఖలా అవుతుంది. అయితే ఇదంతా శాస్త్రజ్ఞానమేగాని అనుష్ఠానంలో కూడా అలాంటి అభినివేశముందా రాముడికనే ప్రశ్న రావచ్చు. జ్ఞానానికెప్పుడూ అనుష్ఠానమే పరిపూర్ణతనిచ్చేది. అది లేనిదే వట్టిమాట లెన్నిచెప్పినా అవి వట్టివే గాని గట్టితనముండదు వాటిలో. మరి రాముడెంత శాస్త్ర పారంగతుడో అంత అనుష్ఠాన సారంగతుడు. అదే మనకు రామాయణోత్తర భాగంలో నిరూపిత మవుతుంది. రెండే రెండు ఘట్టాలు. ఒకటి సీతా పరిత్యాగమూ, మరొకటి శంభూక వధ. ఈ రెండూ చాలు రాముడి ప్రజానురంజన పరిపాలనమనేది ఎట్టిదో మనకు పట్టి ఇవ్వటానికి. ప్రియాహిసీతారామస్య -ప్రాణేభ్యోపి గరీయసీ సీత అంటే రాముడికి ప్రాణం. రెండవ జీవితం. ఆవిడనొక సంవత్సరం చూడకపోతే తనజీవితమే నిరుపయోగమని భావించిన నిష్కల్మష ప్రేమయోగి. అలాంటివాడు ఉన్నట్టుండి ఒక పామరుడన్న మాటకు బద్దపడి తృణప్రాయంగా పరిత్యజించి ఇక మరలా ఆవిడ ముఖం చూడనే లేదంటే ఎంత ధర్మదీక్ష ప్రజాభిప్రాయమంటే ఎంత ప్రామాణ్యబుద్ధి. పదిమంది మెచ్చిందీ వారికి నచ్చింది పరిపాలన అంటే తన కుట్రపడియంగా వచ్చిందికాదు. ఒక పనిచేస్తే లోకులేమంటారో ననే సంకోచ ముండాలి ఎప్పుడూ ప్రభువైన వాడికి. అలాంటి స్వభావమున్నవాడు గనుకనే ఇంకా ఎవరూ తన్ను తప్పుపట్టకముందే లంకానగరంలోనే అనుమానిస్తాడు సీతను. అగ్ని పరీక్షకు గురిచేస్తాడు. పోతే అదికూడా విశ్వసించని అయోధ్యావాసుల కోసం

Page 171

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు