కనుక అతడి సలహా మేరకు తనకు బాధ కలిగించే ఉగ్రకర్ములైన ఆ భీరాదిదస్యుల నందరినీ అది అంతమొందించింది.
కాబట్టి రాముడి వీర్యమంటే అలాంటిది. పైగా ఉత్తమ వీరగుణ సంపన్నుడెప్పుడూ తేలిక బుద్ధి చూపడు. తనకు సరిదీటైన వీరుడితోనే పోరాడుతాడు. తప్ప దీన హీన మానవుల జోలికిపోడు. తెలియక తప్పు చేసినా శరణువేడినా వారిని కరుణించి క్షమించగలడు. ముందు చెప్పిన మాటలలోనే చూడవచ్చు ఆలక్షణం. సకృదేవ ప్రపన్నాయ - తవాస్మీ తిచయాచతే - అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ర్వతంమమ ఒక్కసారి వచ్చి మరుగుచొచ్చితే చాలు. వాడెలాంటి నీచుడైనా అభయమిస్తానంటాడు. కడకు రావణుడైనా సరేనట. శుకసారణులను కాకాసురుణ్ణి అలాగే కాపాడాడు. శుకసారణులు గూఢచారులయి వచ్చి పట్టుబడి ఆయనను శరణు వేడితే శత్రుపక్షీయులని తెలిసి కూడా యదిదృష్టం బలం కృత్స్నం వయంహసుపరీక్షితాః మా సైన్యాన్ని మమ్మలను అందరినీ బాగా పరీక్షించారు గదా. మీరు మా సైనికులకు చిక్కిపోయామని భయపడకండి. న్యస్తశస్త్రులను మేమెప్పుడూ కస్తి పెట్టము. నిర్భయంగా మరలి పొండి. ఒకవేళ ఇంకా చూడవలసింది మిగిలిపోతే తొందరేమీ లేదు. నిదానంగా చూచి వెళ్లండి. వెళ్లి మీ రావణుడికి చెప్పండి నా మాటగా ఏ బలాన్ని నమ్ముకొని సీత నపహరించావో ఆ బలం రేపు యుద్ధరంగంలో చూపమని, వీరంలో దయా వీరమని పేర్కొంటారు దీన్ని. ఇదే వీరుడికి శోభనిచ్చే గుణం.
తీరా యుద్ధానికి దిగే ముందు కూడా రావణుడి కొక అవకాశమిద్దామని ఆలోచిస్తాడు రాముడు. అంగదుణ్ణి రాయబారం పంపుతాడు. మాయోపాయంతో సీత నపహరించినట్టు కాదు. రేపు దానికి యుద్ధంలో పరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. విభీషణుడిలాగా నీవు శరణంటే నీ ప్రాణాలు కాపాడుతాను. లేదా నీతో పాటు సర్వరాక్షసులు లంకా పట్టణంతో సహా మట్టిపాలు కావలసి వస్తుంది. పక్షిలాగా పదునాలుగు లోకాలకూ ఎగిరిపోయినా నాకు పట్టుపడక తప్పదు అని చాటుతాడు. ఎంతమాటో చూడండి ఇది. ధీరోదాత్తుడైన వాడి నోట మాత్రమే వినగలిగిన మాట. అలాంటి వీరుడికి నికృష్టమైన చాటుమాటు వ్యవహారం నచ్చదు. రావణుణ్ణి రణరంగంలో కలుసుకొన్నప్పుడాయన అన్న మాటలు వినండి. శూరోహమితి చాత్మాన - మవగచ్ఛసిదుర్మతే - నైవలజ్జాస్తితే
Page 169