#


Index

ధర్మపాలనము

విద్రావణం చిత్తగించవలసిందే. కోపమే రాదు రాఘవుడికి. వచ్చిందో రాముడు కాడు. మహోద్దాముడే. శాత్రవవిరాముడే. కస్యబిభ్యతి దేవాశ్చ - జాతరోషస్య సంయుగే - రోషావిష్ణుడైతే త్రివిష్టప వాసులైనా చికాకుపడి కాందిశీకులు కాక తప్పదు. అసలే రావణుడు. లోకవిద్రావణుడు. పితామహ వరగర్వితుడు. సమస్త లోక చర్వితుడు. దశాననుడు, విపక్షమృగశిక్షాదక్ష పంచాననుడు. అనన్య సాధ్యుడు మానవులచేత వధ్యుడు. అలాంటివాణ్ణి సామాన్య మానవ రూపంలో వచ్చి ఎదిరించి నిలవటమంటే ఎంత అసామాన్య వీరలక్షణమది.

  విభీషణుడు శరణాగతుడయి వచ్చినప్పుడితడు శత్రుపక్షంవాడు. ఛద్మ బుద్ధితో మన దగ్గరకు వచ్చాడు ఇతణ్ణి చేరదీస్తే తమకేదో ముప్పు తెచ్చి పెట్టటం ఖాయమితణ్ణి వదిలివేయండని సుగ్రీవాదులు హెచ్చరిస్తారు రాముణ్ణి. అప్పుడు రాముడు మందహాసం చేసి వారితో ఇలా అంటాడు. సూక్ష్మమప్యహితం కర్తుమ్ - మమాశక్తః కథంచన నాకొకడు కీడు చేయటమనేది కలలోని వార్త. పిశాచాన్ దానవాన్ యక్షాన్ - పృథివ్యాంచైవ రాక్షసాన్ - అంగుళ్యగ్రేణ తాన్ హన్యామిచ్ఛన్ హరిగణేశ్వర దేవదానవ యక్షరాక్షసులెవరైనా సరే. నేను తలుచుకొన్నానంటే కొనగోటితో మీటి పారేయగలను. నన్ను శరణని వేడితే వాడు విభీషణుడే గాదు. రావణుడైనా సరే అభయమిస్తాను. ఎంత ఉదాత్తమైన మాటో చూడండి ఇది. తన వీరత్వమందు తనకెంతటి ఆత్మవిశ్వాసమో చూడండి. తలచుకొంటే ఎంతపనైనా చేయగలడట. ఇదుగో ఈ తలచుకోటమనే మాటలో ఉంది మర్మమంతా ఇంత పనిచేయగలడా ఏమిటింత దీనంగా అమాయకంగా ఉన్నాడనిపిస్తుంది రామాయణంలో రాముడి వ్యవహారం మనకు కాని సమయం వచ్చిందో ఇక ఆయనకు పట్టపగ్గాలుండవు. అప్పుడు తెలుస్తుందాయన అతిలోకమైన పరాక్రమమెట్టిదో. ఒకే బాణమది అమోఘం. రెండవ బాణమక్కరనేలేదు. ఒక్క బాణమే హతమార్చింది తాటకాదులను. ఒక్కటే జవాబు చెప్పింది పరశురాముడి అహంకారానికి. చాటు నుంచి వేసినా గురి తప్పక ప్రాణాలు తీసింది వాలినది. కావు కావుమని అరచి పరచి మరలా తన కాళ్లమీద పడేదాకా తరమికొట్టింది కాకాసురుణ్ణి. కడకు కోపం వచ్చి కడలిమీద కూడా ఒక్కబాణమే ఎక్కుపెట్టింది. సముద్రుడు పాదాలమీద పడ్డా విడిచిపెట్టదది. దాని పని అది చేయవలసిందే. తాటకాదుల దగ్గరి నుంచీ అలాగే గదా చేస్తూ వచ్చింది.

Page 168

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు