#


Index

ధర్మపాలనము

వారడగకపోయినా ఇవ్వవలసిన మాట అది. అలాంటిది ఇచ్చి తప్పటమా ? అది కలలో జరగని విషయమంటాడు. చూడండి ఉత్తమ క్షత్ర ధర్మమంటే ఎలాంటిదో. ఇలాంటి ధర్మాన్నే చివరదాకా వదలకుండా పాటిస్తూ వచ్చాడు రాముడు. కడకు వాలి తన్ను వధించట మన్యాయమని తప్పు పట్టినా మేము క్షత్రియులం. ఆర్తత్రాణ పరాయణత్వమే మా కర్తవ్యమని అతనికి తన క్షత్ర ధర్మాన్ని వివరించి చెబుతాడు.

  క్షత్ర ధర్మమైన తరువాత నాలుగవది మిత్రధర్మం. ఇది కిష్కింధలో మనకు దాఖలా అవుతుంది. సుగ్రీవుడి విషయంలో పాటించింది మిత్ర ధర్మమే. ఆ మాటకు వస్తే అయోధ్యలోనే వస్తుందీ మిత్రధర్మం. గుహుడనే నిషాద రాజాయన కెంతో ప్రియమిత్రుడు. తన నిషాద రాజ్యాన్నే ఆయన కప్పగిస్తానన్న ప్రాణస్నేహితుడు. పోతే ఇక సుగ్రీవుడి విషయం చెప్పనే అక్కరలేదు. అతనిపట్ల రాముడు చూపిన మైత్రి ఎనలేనిది. అతణ్ణి అంత వరకూ చూడలేదు పెట్టలేదు రాముడు. కబంధుడు చెప్పే వరకు అతడి ఊసే తెలియదు. కబంధుడు తనచేత శాపవిముక్తుడయి సుగ్రీవుడనే వానరరాజున్నాడు. అతడు సత్యసంధుడు. వినీతుడు. ధృతిమాన్ మతిమాన్ మహాన్ అని అతడి గుణగణాలు వర్ణించి సతే సహాయోమిత్రంచ భవిష్యతి అని ఎప్పుడన్నాడో అదే రాముడి కతని మీద మైత్రికి కారణమయింది. సుగ్రీవుడు కూడా వారిని దూరం నుంచి చూచి భయపడ్డా ఒక అవ్యక్తమైన మధురానుభూతి ననుభవిస్తూనే వచ్చాడు. దీర్ఘబాహూ విశాలాక్షౌ శరచాపాసిధారిణి కస్యనస్యాద్భయం దృష్ట్యా - హ్యేతౌ సురసుతోపమౌ అని మొర పెడతాడు హనుమంతుడితో. ఈ వర్ణన చూస్తే ఇలాంటివాడు తనకు మిత్రుడైతే ఎంత బాగుండు వాలిని తప్పకుండా జయించవచ్చుననే ఆశ కూడా ఇమిడి ఉంది ఇందులో. వీరిని చూస్తే ఎవరికి భయం కలగదనటంలో వాలి అయినా సరే భయపడవలసిందే. అందుచేత వీరితో స్నేహం చేయటమే వాంఛనీయం. అయితే స్నేహపాత్రులో కారో తెలిసేదెలాగా. అందుకే శుద్ధాత్మానౌ యదిత్వేతౌ జానీహి - మంచివారో కారో తెలుసుకొని రమ్మని పంపుతాడు హనుమంతుణ్ణి. రాముణ్ణి చూడగానే ఎన్నడూ చూడని వాడికి కూడా చూడండి ఎలాంటి స్నేహభావం కలుగుతున్నదో.

  ఇలాంటి భావమా సుగ్రీవుడికే గాదు. హనుమంతుడికి కూడా అదే గొప్పభావం. సుగ్రీవుడికి మైత్రీ భావమైతే ఆయనకు స్వామి భావమేర్పడింది రాముడి మీద.

Page 162

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు