వాడనయ్యానని రాజ్యభారం మోయలేనని తన గోడంతా చెప్పుకొని వెంటనే రెండవరోజే నీకు పట్టాభిషేకం చేయాలని ఉంది. అది భరతుడు వచ్చే లోపలే అయిపోవాలి. వాడు నీకెంత అనురక్తుడైనా చెప్పలేము. మానవుల బుద్ధులు నమ్మరాదుగదా అని లేని పోని అభాండాలన్నీ వేస్తాడు. తనలో దాగి ఉన్న భయాన్ని మరొక భంగిమలో బయట పెడతాడు. ఇదంతా వాస్తవంలో రాముడికిష్టంలేదు. అయినా పితృగౌరవంతో సహించాడు. పల్లెత్తు మాట బదులాడకుండా వెళ్లిపోయాడు. మాటలాడటం చేత గానివాడా అంటే అలాకాదు మరలా ఆ ఆవేదన అంతా తల్లిదగ్గర వెళ్లగక్కుతాడు. అదీ ఎంతో నాజూకుగా. అంబపిత్రా నియుక్తోస్మి - ప్రజాపాలన కర్మణి - భవితాశ్వోభిషేకోయం - యథామే - శాసనమ్ పితుః అమ్మా తండ్రి గారంటున్నారు. నాకు రాజ్యపాలన ఒప్పజెబుతారట. రేపేనట అభిషేకం. ఇలాగని ఆదేశిస్తున్నాడు. మరి విన్నావా అంటాడు. రేపేనంటే ఆవిడకు తెలియదా భరతుడయోధ్యలో లేడని. రెండవరోజుకే రాలేడని. భరతుడు కూడా లేకుండా ఇంత హడావుడిగా తండ్రి ఈ పట్టాభిషేకం నాకు తలపెట్టటమేమిటి. ఇది జరిగేదేనా? ఆయన చేయలేడు. నేను చేసుకొనేది లేదు. అని ఎంత కాకువుగా ఆక్షేపించటమో చూడండి ఇది. అయినా తండ్రిని తల్లి ఎదుట ఆక్షేపిస్తున్నా ఎంత నిగ్రహమో చూడండి మరలా.
తరువాత అభిషేక భంగమయి మరలా తన్ను పిలిపించినపుడు కూడా ఏదో మహత్తరమైన పనిఅయి ఉంటుందని ఆలోచిస్తూ వచ్చి తండ్రిని చూడగానే ఆయన రామా అని మాట్లాడలేక పడిపోతే ఎంతగానో భయపడతాడు. ఎప్పుడు వచ్చినా ఆనందంగా పలకరించే తండ్రి ఎందుకిలా ఆయాస పడుతున్నాడు. బహుశ నా వల్లనే ఏదైనా అపచారం జరిగి ఉంటుందని బాధపడతాడు. పైగా ఒక మాట అంటాడు. అతోషయన్ మహారాజ-మకుర్వన్ వాపితుర్వచః ముహూర్తమపినేచ్చేయం జీవితుమ్ తండ్రి మాట పాటించకుండా ఆయన మనసుకు సంతోషం కలిగించకుండా ఒక్కక్షణం కూడా బ్రతకలేనంటాడు. ఇంకా తండ్రి తనతో పలకలేదు. భాషించలేదు. అది తన అపరాధమే అయి ఉంటుందని ఎలాగైనా ఆయనను సంతోషపెట్టి తన అపరాధం పాపుకోవాలని భావించాడంటే ఎంతటి పితృప్రేమో ఇది చూడండి. పిమ్మట కైక చెబితే జరిగిన సంగతి తెలిసి ఇలా అంటాడామెతో. అమ్మా ఆయన
Page 157