దానితో సంతుష్టుడైన రాముడాయనతో ఇలా అంటాడు. నన్ను మీతో పంపేటప్పుడు మా తండ్రి గారు శాసించారు గురువుమాట జవదాటరాదని. సోహం పితుర్వచః శ్రుత్వా శాసనా దహ్మవాదినః - కరిష్యామి న సందేహః తాటకా వధ ముత్తమమ్ అని ఆయనమీద తనకున్న అచంచలమైన గౌరవాన్ని ప్రకటిస్తాడు. ఇలాంటి ప్రామాణ్య బుద్ధి ఉండాలి గురువుల విషయంలో ఏ శిష్యుడికైనా, గురువైన వాడు తనకే విషయం బోధించినా తెలియకుండా బోధిస్తాడా అనే శ్రద్ధాభక్తులుండట మెంతైనా అవసరం. అదే ప్రస్తుతం రాముడిపట్ల కూడా మనకు కనిపిస్తుంది.
అంతేకాదు. గురువు ధర్మదీక్షలో ఉన్నప్పుడాయన కెలాంటి విఘ్నాలు, ఉపద్రవాలు సంభవించకుండా చూడటం శిష్యుడి బాధ్యత, ఛాత్రుడని గదా శిష్యుణ్ణి పేర్కొంటారు. ఛాదయతీతి ఛత్రం - ఛత్రవదాచరతీతిఛాత్రః ఒక ఛత్రంలాగా గురువును కాపాడేవాడు కాబట్టి ఆ పేరు వచ్చింది శిష్యుడికి ఆరు రాత్రుల వరకూ దీక్షలో ఉన్న ఆచార్యుణ్ణి మారీచసుబాహుల బారినుంచి కాపాడి ఆ పేరు సార్థకం చేసుకొన్నారు రామలక్ష్మణులు. పైగా అద్యైవ దీక్షాంప్రవిశ - భద్రమే మునిపుంగవ సిద్ధాశ్రమాయం - సిద్ధః స్యాత్ - సత్యమస్తు వచస్తవ - ఇవాళే తాము దీక్షలో ప్రవేశించండి. మీకు తప్పక విజయం కలుగుతుంది. ఇది సిద్ధాశ్రమం గదా. సిద్ధి కలగకపోవటమేమిటని బరవసా ఇస్తారు. ఆ తరువాత ప్రీతుడైన ఆచార్యుడు వారికి మరలా అస్త్రప్రదానం చేస్తాడు. కథలు చెబుతాడు. అంతేగాక తన తపస్సును సఫలం చేసినందుకాయన బ్రహ్మచర్యాన్ని కూడా ఫలవంతం చేయాలనుకొన్నాడు. బ్రహ్మచర్యానికి ఫలమేమిటి. గార్హస్యమే. అది సీతా కళ్యాణంలో గాని జరగదు. దానికి ధనుర్భంగం పణమని తెలుసు విశ్వామిత్రుడికి. అది చేయగలవాడు తన ప్రియశిష్యుడు రాముడేననీ తెలుసు. అందుకే వచ్చిన పని నెరవేరినా ఇంకా అతనితో పని ఉన్నట్టు రాముణ్ణి వెంటబెట్టుకొని మిథిలాపుర ప్రయాణం. గురువనుజ్ఞ లేకుండా ఏ పనీ తలపెట్టరాదు శిష్యుడు. అందులో తనకెంత అభిలాష ఉన్నా సరే. సామర్థ్యమున్నా సరే. ధనుర్దర్శయ రామాయ అంటాడు జనకుడితో విశ్వామిత్రుడు. తెప్పించి చూపుతాడు జనకుడు. వత్సరామధనుః పశ్య రామ ! వెళ్లి ఆ ధనువును చూడు అంటాడు మరలా రాముణ్ణి చూచి. అలాగేనని వెళ్లి ధనువును మంజూషలో నుంచి బయటికి తీసి దీనిని తోలనం చేయమంటారా పూరణం చేయమంటారా.
Page 154