#


Index

ధర్మపాలనము

  ఇచ్చినవి పరిగ్రహించటమే గాని తానుగా ఏదీ కోరడా శిష్యుడు. నోరువిప్పి మాట్లాడడు కూడా. మరీ మాట్లాడకపోతే అది స్తబ్దత జడత్వం కావచ్చు. అది మరలా పనికి రాదు శిష్యుడికి. పరిప్రశ్నేన సేవయా అన్నారు. పరిచర్య చేస్తూనే అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ తెలుసుకోవాలి తెలసుకోవలసిన విషయాలు. ఏముంటాయి తెలుసుకోవలసినవి రాముడికి. అన్నీ తెలిసినవే భగవానుడికి. అయినా తెలియనట్టు గదా ఇప్పుడు నటిస్తున్నాడు. గురువుకు మర్యాద ఇచ్చినట్టు తనకు జిజ్ఞాస ఉన్నట్టు కనపడాలి. అందుకే మార్గమధ్యంలో కామాశ్రమం కనపడ్డా ఒక గౌతమాశ్రమం కనపడ్డా అదేమిటిదేమిటని అడుగుతూ పోతాడు. అడిగితే దానికి సంబంధించిన పూర్వవృత్తమంతా ఆ గురువుగారే కరువు పెడుతుంటాడు. శిష్యుడైన వాడికి బహుదేశాటనమే గాక ఆయా దేశచరిత్రలన్నీ తెలిసి ఉండాలనే విద్యా సంప్రదాయ రహస్యాలు కూడా మనకు బోధపడతాయి. పైగా అవన్నీ ఆయా దేవతల కథలూ, మహర్షుల కథలూ నిజంలో అవన్నీ తన కథలే. తానేగా దేవ ఋష్యాదులందరికి ఆరాధనీయుడు. ఇంకా ఒక చిత్రముంది ఇందులో కథలు చెబుతూ చెబుతూ తన కథ గూడా కొంత ప్రస్తావించాడు విశ్వామిత్రుడు. ఇది రాముడడగలేదు. గురువుగారి స్వీయచరిత్ర చెప్పమని శిష్యుడడగటం ధర్మంకాదు. తెలుసుకోవాలని ఎంత కుతూహలమున్నా వినయపరుడైన శిష్యుడికది శోభనివ్వదు. అది తెలిసే రాముడూరకున్నాడు. అయినా ప్రస్తావవశంగా అది గురువుగారి నోటనే వచ్చింది. అయితే తాను చేసిన ఘనకార్యాలు, మేనకాదులతోడి తన విహారాదులు, తన నోటనే రాగూడని విషయాలు. అవి జనక మందిరంలో అహల్యానందనుడైన శతానందునిచేత పలికిస్తాడు వాల్మీకి. శిష్యుడి ఎదుట ఆయన గురువుగారి మాహాత్మ్యం మరొకరిచేత చెప్పించటంలోనూ తన్ముఖంగా శిష్యుడు గ్రహించటంలోను ఎంతైనా ఔచిత్యముంది. ఔచిత్యంతో పాటు ఒక నాటకీయత కూడా చోటు చేసుకున్నది.

  ఆచార్యుడంటే అన్నీ తెలిసిన రాముడికి కూడా ఎంతో గౌరవం ఆయన ఎడల ఎంతో ప్రామాణ్యబుద్ధి. తాటకను వధించమని గురువుగా రాదేశిస్తే స్త్రీని వధించటమెలాగా అని పై కనకపోయినా లోపల సందేహంగానే ఉంది రాముడికి. అది గమనించి విశ్వామిత్రుడు నహితే స్త్రీ వథకృతే ఘృణాకార్యా నరోత్తమ చాతుర్వర్ణ్వహితార్థాయ కర్తవ్యమ్ రాజసూనునా అని అతని సందేహ నివృత్తి చేస్తాడు.

Page 153

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు