#


Index

ధర్మపాలనము

లోభముంటే నాతో పంపమని ఒప్పించి తీసుకుపోతాడు. ఆయన అలా తీసుకెళ్లుతుంటే ఎందుకు ? ఎక్కడికనే ప్రశ్నే లేదు. ఆయన ఎన్నాళ్లనుంచో తనకు పరిచయమున్నట్టు ఆయన వెంట వెళ్లటమే తన కర్తవ్యమయినట్టు సంతోషంగా వెళ్లుతాడు రాముడు. గుర్వనువర్తన మంటే ఇది. ఆ గురువుగారి మీద అంత నమ్మకం శిష్యుడికి. వసిష్ఠుడందరితో చెప్పనే చెప్పాడు కృతాస్త్రమకృతాస్త్రంవా నైనం ద్రక్ష్యంతిరాక్షసాః గుప్తమ్ కుశికపుత్రేణ జ్వలనేనామృతం యధా తన కులగురువు వసిష్ఠుడంత వాడంత ప్రశంసాపత్ర మిచ్చిన విశ్వామిత్రుడెంత గొప్పవాడో ఇక ఎవరూ చెప్పనక్కరలేదు రాముడికి. అందుకే మౌనంగా ఆయన ననుసరించాడు. అంతేగాదు. ఏషోస్తాన్ వివిధాన్ వేత్తి - సర్వాస్త్రాణి భృశాశ్వస్యపుత్రాః పరమధార్మికాః కౌశికాయ పురాదత్తాః సమస్త శస్త్రాస్త్ర విద్యలూ కరతలామలక మీయనకు - భృశాశ్వపుత్రులైన దివ్యాస్త్రాలన్నీ ఆయనకు పిలిస్తే పలుకుతాయని వసిష్ఠుడు చెప్పటం విన్నాడు. తన భవిష్యత్ప్రణాళిక కది చక్కగా సరిపోయిందనుకొన్నాడు. వినయంతో గురువు ననుసరించాడు.

  గురుజనంపట్ల మొట్టమొదట ఉండవలసింది వినయం. అది సంపూర్ణంగా ఉంది రాముడికి. విశ్వామిత్రోయయావగ్రే - తతోరామోమహాయశాః ముందు గురువుగారు నడుస్తుంటే వెనుక తాను నడుస్తున్నాడు. కాక పక్షధరుడయి కమనీయ రూపుడైన ఆ శిష్యుణ్ణి చూస్తే ఆ గురువు కూడా వాత్సల్యంతో కరిగిపోయేవాడు. రామా అని మధురంగా పిలిచేవాడు. నాయనా జలం చేతికి తీసుకో చాలదూరం నడిచావు. శ్రమ అనిపించవచ్చు. క్షుత్పిపాస లేర్పడవచ్చు. రెండింటికి నివారణగా బలాతిబలలనే విద్యలు మీకుపదేశిస్తానంటాడు చూడండి. నాకే విద్యలూ చెప్పమని అడగడు రాముడు. వినయంగా అనుసరిస్తూ పోయాడంతవరకే. అలసటో ప్రయాసమో గురువుగారికి చెప్పక్కరలేదు. అంతా ఆయనే చూచుకొంటాడు. శిష్యుడు యోగ్యుడనిపించుకోవాలే గాని సమర్థుడైన గురువు అతని యోగ్యత కనిపెట్టి తానే అతనికి కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. అందుకోసం శిష్యుడు ముందుగానే అఱ్ఱులు చాపనక్కరలేదు. ఇదుగో ఇలాంటి నమ్మకము బరవసా ఉండాలి గురువుపట్ల శిష్యుడికి. శిష్యుడి గుణాలూ గురువుకుబాగా నచ్చినట్టే ఉన్నాయి. కామం బహుగుణాస్సర్వే - త్వయ్యేతే నాత్రసంశయః అని అప్పుడే కితాబిస్తాడు. సకల విద్యలూ బోధిస్తాడు.

Page 152

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు