#


Index

ధర్మపాలనము

మహానుభావులు. బ్రహ్మర్షిగానే ఉద్భవించి శక్తి పరాశర వ్యాసాది మహనీయులకు పితృ పితామహస్థానంలో ఉన్న వారొకరైతే, రాజర్షి అయి తపః ప్రభావంచేత బ్రహ్మర్షి పదవినందుకొని తన పేరు చెబితేనే మూడు లోకాలనూ గడగడలాడించి ఎంత రాజసుడో అంత శమదమాది సంపన్నుడయి సాక్షాత్తూ గాయత్రీ మంత్రద్రష్ట అయిన వారొకరు. కనుకనే ఆయన వసిష్ఠుడు, సర్వశ్రేష్ఠుడు. ఈయన విశ్వానికంతా మిత్రుడు విశ్వామిత్రుడు. ఇలాంటి వారి శిక్షణలో రాటుదేరిన రాముడెలాంటివాడు కావచ్చునో మన మూహించవచ్చు.

  రామాదులు జన్మించగానే జాతకర్మాదులూ నామకరణము చేసినవాడు వసిష్ఠుడు. కులపురోహితుడు గదా ఆయన. ఆయనే తరువాత వేదవేదాంగాది విద్యలు నేర్పి ఉంటాడు. దానితో వారు సర్వేవేదవిదఃశూరాః, సర్వేలోకహితేరతాః సర్వేజ్ఞానోప సంపన్నాః సర్వేసముదితాగుణైః అని లోకంలో పేరు గాంచారు. మరి ధనుర్వేద, గజస్కంధ, అశ్వపృష్ఠ, రథచర్యాది క్షాత్ర విద్యలన్నీ తండ్రి దశరథుడివల్లనే అభ్యసించి ఉంటారు. పితృశుశ్రూషణేరతాః అనే మాటలో అదే ధ్వనిస్తుంది. తండ్రికూడా గురువేగదా శాస్త్రీయంగా. పోతే తేషాంకేతురివ జ్యేష్టో, రామోరతికరః పితుః రాముడందరిలోనూ పతాకలాగా ఎత్తుగా కనిపించేవాడు. విద్యాభ్యాసమంతా పూర్తి అయింది. కాని వాటికి మెరుగుపెట్టే ఘట్టమింకా జీవితంలో ఎదురవలేదు. మానుషదైవ శక్తులు రెండూ సమకూడవలసి ఉంది. అవి సమకూడిన తరువాత కళ్యాణ ప్రాప్తి కూడా అయి జీవితంలో ఒక స్థాయి నందుకోవలసి ఉంది. భావి రాక్షస సంహారానికి కావలసిన శక్తి సామర్ధ్యాలు సాధించి తన అవతార ప్రయోజనాన్ని నిరూపించుకునే అవకాశం కోసమెదురు చూస్తున్నాడా మహాపురుషుడు.

  సరిగా సమయానికి బయలుదేరి వచ్చాడు విశ్వామిత్రుడు. అధర్మపరులైన దానవులను తునుమాడి విశ్వానికంతా మేలు చేయాలని ఆయన సంకల్పం. అది సిద్ధాంచాలంటే ధర్మసంస్థాపన కోసమదేపనిగా అవతరించిన రామచంద్రుడే సమర్థుడని తెలుసు నాయనకు. కనుకనే హడావుడిగా వచ్చాడు దశరథుడి దగ్గరకు. రాముణ్ని తనతో పంపమన్నాడు. దశరథుడు పుత్రవ్యామోహంలో పడి వెనుకాడుతుంటే ధైర్యం చెబుతాడు. అహంవేద్మి మహాత్మానమ్ నాకు తెలుసు రాముడంటే ఎవరో. నీకేమి తెలుసు. ఇంకా వసిష్ఠాదులకు తెలుసు. నీకు యశోధర్మలాభం మీద

Page 151

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు