#


Index

ధర్మపాలనము

కూడా నచాస్యమహతీం లక్ష్మీమ్ రాజ్యనాశోపకర్షతి - ముఖద్యుతి ఏ మాత్రమూ వాడిపోలేదట. పోతే అనసూయకః అసూయ అంటే గుణంలో దోషాన్ని వెదికేపాడు బుద్ధి. ఇది అసలేలేదు సరిగదా నిజంగా దోషమున్న చోట కూడా గుణాన్నే చూస్తాడు రాముడు. కైక విషయంలో ఇది ముమ్మూర్తులా సాక్షాత్కరిస్తుంది. లక్ష్మణుడు నిందించినా భరతుడుపాలంభించినా వారిని నివారిస్తాడు రాముడు. తుదకు మందరలాంటి దాసీని పట్టి చంపబోయిన శత్రుఘ్నుణ్ణి కూడా నివారిస్తాడు. ఇక అన్నిటికన్నా ఆఖరుది కస్యబిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే సామానికి సామమే దండానికి దండమే. దేనికదే. నీతిర్నీతిమతామస్మి దండోదమయతా మహమ్ అని తానే గదా చాటాడు జగత్తుకు. కోపం వస్తే దేవతలైనా భయపడవలసిందే ఆయనకు. సముద్రాదులలాగే కదా హడలిపోయారు.

  షోడశ కళాధరుడైన చంద్రుడిలాగా షోడశ గుణాకరుడైన రామచంద్రుణ్ణి ఇలా వర్ణించటం జరిగింది కావ్యారంభంలోనే. దానికనురూపంగానే కథా వస్తువు కూడా రూపుదిద్దుకొంది. పోతే రామో విగ్రహవాన్ ధర్మః అని ప్రసిద్ధి గాంచినందు కాయన తనజీవితంలో పాటించిన పాలించిన ఆ ధర్మమెలాంటిది. ఏయే ధర్మాలెక్కడ ఎలా పాలించాడు. ఎంత దీక్షతో పాలించాడు. దానివల్ల ఎదురయిన కష్టసుఖాల నెలా భరించాడలా పాటించిన వారినెలా ఆదరించాడు. పాటించని వారినెలా శిక్షించాడు. ఇలాంటి ధర్మమీమాంస చేయవలసి ఉంది మనమిప్పుడు. ముక్తసరిగా చెప్పుకొంటే బాల నుంచి ఉత్తరదాక ఏడుకాండల కథా జీవితంలో ఏడు ధర్మాలు సాగించాడు రామచంద్రమూర్తి, బాలలో శిష్యధర్మం, అయోధ్యలో పుత్రధర్మం, అరణ్యలో క్షత్రధర్మం, కిష్కింధలో మిత్రధర్మం, సుందరలో స్వామిధర్మం, యుద్ధంలో వీరధర్మం. మరి ఉత్తరలో రాజధర్మం. ఇలా ఏడు ఉత్తమ ధర్మాలు ప్రధానంగా కనిపిస్తాయి. అవి ఆయన సమగ్రమైన ధర్మస్వరూపాన్ని మనకు కన్నులగట్టినట్టు సాక్షాత్కరింపజేస్తాయి.

  బాలకాండలో శిష్యధర్మమన్నాము. ఎలాంటిదా శిష్యధర్మం. ఎవరాయన శిష్యత్వం నెరపిన గురువులు. ఇద్దరే ఇద్దరు. ఒకరు ఆయన పుట్టకముందు నుంచీ నిర్యాణమయ్యేదాకా అనుసరిస్తూ వచ్చిన వసిష్ఠుడు. మరొకరు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వచ్చి వివాహం కాగానే నిష్క్రమించిన విశ్వామిత్రుడు. ఇద్దరూ ఇద్దరే

Page 150

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు