#


Index

ఆలోకనము

సమాధానము లేదు. పాఠకులు వేసే ప్రశ్నలన్నిటినీ తానే వేసుకొని సమాధానాలిస్తున్నట్టు రచిస్తూ పోవటమే ఉత్తమ కళాకారుడు చేసే పని. అలా చేసినవాడే భారతకారుడైన వ్యాసుడు. రామాయణ కారుడైన వాల్మీకి. వాల్మీకి కళ ఇంకా గోప్యమైనది. సుందరమైనది. అందుకే పురాణేతిహాస వాఙ్మయమంతటిలో ఇది ఒక్కటే కావ్యమని కీర్తిగాంచింది. అసలే ఇతిహాసమిది. ఇతిహాసమంటే పురాణంలాగా అర్థవాదమని గదా పేర్కొన్నాము. అందులో పురాణాలు పూర్తిగా అయితే ఇతిహాసం కొంతకు కొంత అర్థవాదం. నూటికి యాభయి వంతులు లోకంలో జరిగిందైతే యాభయి వంతులు కవి కల్పన. ఇది ఇక్కడ అర్ధవాదం. ఒక సత్యాన్ని చాటటానికి ప్రతీకగా పనిచేసేదే అర్ధవాదమంటే. ప్రతీకమన్నపుడిక దానిమేరకే తడవి చూచి ఇది ఎట్లా అది ఎట్లా అని మనం ప్రశ్నించరాదు. ఆక్షేపించరాదు. అది దేనికోసముందో దానిని పట్టుకోవాలి చేతనైతే. అందుకోసమే ఉద్దిష్టమది. అందులోనూ కాంతా సమ్మితమైన కావ్యచ్ఛాయ కూడా దానికెప్పుడు సంక్రమించిందో అప్పుడంతా గోప్యమే. అంతా రహస్యమే.

  ఇందులో అంతరమైన సత్యాన్ని అతిసుందరమైన పక్కిలో ఆవిష్కరిస్తూ ఆ రెండింటి ద్వారా కావ్యపరమార్ధమైన మోక్షమనే శివాన్ని మనకుపదేశిస్తున్నాడు మహర్షి. త్రివేణీ సంగమంలాగా సత్యసుందర శివాత్మకమైనదీ రామాయణ మహాకావ్యం. శుద్ధ సత్త్వ సంపన్నుడైన శ్రీరామచంద్రుడు దీనికి కధానాయకుడు. మహాభారతంలాగా నానారస భావ బంధురంగా నడచినా కేవల శాంతరసంతోనే చివరకు పర్యవసానం చెందుతున్నది. ఇలాంటి ఉదాత్తము, ఉజ్జ్వలము అయిన రచనెవరికంటే వారి కర్ధం కాకపోవటంలో ఆశ్చర్యంలేదు. అయితేనే ఇంకా ఆశ్చర్యం. కాళిదాసాదులకే అంతుపట్టక తెట్టగిల పడ్డారు. కేవల రజస్తమో గుణ గ్రహణ గోచరం కానేరదు. మన బుద్ధులకు స్ఫురించిందేదో అదే దానిలో ఉన్న భావమని భావిస్తాము. అలాకాక

Page 15

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు