#


Index

ఆలోకనము

నృపాణాం జయశాలినామ్. ప్రజాపతిదగ్గర నుంచి అసుస్యూతంగా వస్తూ ఉన్న వంశమది.

  దీనిని బట్టి తేలిందేమంటే అలాంటి ఇలాంటి కథగాదది. నా స్వకపోలకల్పితం కూడా గాదు. ఇంతకు ముందునుంచీ దేశంలో ప్రసిద్ధమయిందే. కథానాయకుడైన రాముడు కూడా తక్కువ వాడుకాదు. ఇక్ష్వాకు వంశజుడు. ఆ ఇక్ష్వాకు రాజులు కూడా తక్కువ వారు కాదు. మహాత్ములు. ప్రజాపతి వారికి మూలపురుషుడు. ఈ భూమండలం నర్వము వారు మొదటినుంచి హక్కు భుక్తం చేసుకొని ప్రజానురంజకంగా పాలించినవారు. అలాంటి వారి వంశ కథ వ్రాస్తున్నాను నేను తద్వారా నేను మీకు బోధిస్తున్నది ధర్మార్థకామాలు. అవి వాచ్యంగానైతే వ్యంగ్యంగ నేను చేస్తున్నది మీకు తత్త్వబోధే. కాబట్టి అసూయ లేకుండా శ్రవణం చేయండని ఇంతదూరం మనలను మందలించి చెబుతున్నాడు మహర్షి. ఇంత మందలింపుకూడా పెడచెవిని బెట్టి మనమింకా దుర్విమర్శలు చేస్తున్నామంటే అది కేవల మవివేకమే. కల్పవృక్షంలాంటి కధను విషవృక్షంగా వ్యాఖ్యానించామంటే ఆ విషం రామాయణాన్ని ఏమీ చేయలేదు గాని దాని గాలి సోకిన మన అందరికీ అదే మారకమై కూర్చుంటుంది సందేహం లేదు.

  అసలొక అద్భుతమైన చమత్కార మేమంటే భావితరాల వారి ఆక్షేపణల కేదీ తావివ్వలేదు మహర్షి. ఎవరి కెప్పుడెలాంటి ఆశంకలు కలగటాని కవకాశముందో అదంతా స్వయంగానే ఊహించి తదనుగుణంగా తన రచనలో సమాధానం చెప్పుకొంటూ వచ్చాడు. అయితే చాలావరకది వాచ్యంగా కాక వ్యంగ్యంగా సూచన చేశాడు. ఆ సూచనలు రామాయణమంతా కొనా మొదలు వెల్లివిరిసి ఉన్నాయి. భావుకుడైనవాడు అవి ఎక్కడెక్కడ ఉన్నవో కవిబ్రహ్మ చెప్పినట్టు అరసి చూస్తే దొరుకుతాయి. వాటన్నింటినీ కలుపుకొని ఆ వెలుగులో ఆ మూలాగ్రము పరిశీలించి చూస్తే రామాయణంలో ఇక ప్రశ్నాలేదు.

Page 14

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు