#


Index

ధర్మపాలనము

గురితప్పి వధ్యుడు కానివాణ్ణి వధించిందేమో గాని తనయుడి బాణం మాత్రం చాటునుంచి ప్రయోగించినా వధ్యుడైన వాణ్ణి వధిస్తుంది. ఒకేబాణం, ఒకేమాట, ఒకేపత్ని అనేది రాముణ్ణి చూచి పుట్టినమాటే. ధర్మానికి మారుపేరే శ్రీరాముడు. అంతకుముందు లేదది ఆ తరువాతలేదు. భగవదవతారం గనుకనే ఆయనకే దక్కిందా గౌరవం.

  అసలు రామాయణారంభంలోనే వస్తుందొక చక్కని ప్రస్తావన. ఇంకా రామాయణేతిహాస రచన కుపక్రమించలేదు వాల్మీకి. సర్వలక్షణ లక్షితుడైన మహాపురుషుడెవడైనా నీ ఎఱుకలో ఉంటే చెప్పమని అడుగుతాడాయన నారద మహర్షిని. త్రిలోక సంచారి అయిన నారదుడు బేరీజువేసి అందరినీ త్రోసిపుచ్చి చివరకొక్క శ్రీరాముడికే పట్టాభిషేకం చేస్తాడు. సకల సద్గుణాలూ ఆయన ఒక్కడిలోనే రాశీభూతమయి ఉన్నాయి. కావలసి ఉంటే ఆయననే కథానాయకుణ్ణి చేసుకొని కావ్యనిర్మాణం చేయమని చెప్పి వెళ్లిపోతాడు. ఆ సందర్భంలో ఆయన ఉదాహరించిన నాయక లక్షణాలొకటిగాదు రెండుగాదు. చాలా ఉన్నాయి. ధర్మజ్ఞ స్సత్యసంధశ్చ ప్రజానాం చ హితేరతః మొట్టమొదటనే ధర్మజ్ఞుడని పేర్కొంటాడు రాముణ్ణి. ధర్మానికాయన జీవితంలో అంత ప్రాధాన్యముంది. ధర్మం తెలిసినవాడు ధర్మజ్ఞుడు. కనుకనే సత్యసంధుడు కూడా. సంధ అంటే ప్రతిజ్ఞ. చెప్పినమాట నెరవేర్చటమే సత్యసంధత్వం. ఇవి రెండూ ఉన్నవాడు తప్పకుండా ప్రజాహిత కార్యధురంధరు డవుతాడు. ఉత్తమ మానవుడికే గాక దేశమేలే ఉత్తమ క్షత్రియుడి కవశ్యంగా ఉండవలసినవీ మూడు లక్షణాలూ. యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యస్స మాధిమాన్ అవి మూడు అలవడితేచాలు దిగంత విశ్రాంత యశస్సంపన్నుడవుతాడు. దానికి తోడు జ్ఞానమూ, ఆ జ్ఞానానికి తగిన శుచిత్వము కూడాఉంటే ఇక చెప్పనే అక్కరలేదు. శుచిత్వమంటే ఆర్జవం లేదా నిజాయితీ. అదే ఒక వశీకరణ విద్యలాగా పనిచేస్తుంది లోకంలో. దానితో సర్వలోక ప్రియస్సాధుః సకల జన ప్రియంభావుకుడని పేరు గడిస్తాడు. అంతమాత్రాన చవట పిఱికి అయితే మరలా సుఖంలేదు. అది అశక్తతక్రిందికి వస్తుంది. కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీసమః సమయాను గుణంగా నిగ్రహానుగ్రహాలు ప్రదర్శిస్తుండాలి మరలా. సముద్రంలాంటి గాంభీర్యమూ, హిమాలయంలాంటి ధైర్యగుణమూ-వైశ్రవణుని వంటి త్యాగబుద్ధి, సర్వసమత్వం

Page 148

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు