#


Index

రామ యాథాత్మ్యము

పరమాత్మ. మరో మార్గంలేదు. అలా జన్మిస్తేనే పితామహుడి వరాన్ని తాను మన్నించినట్టూ అవుతుంది. వాణ్ణి మట్టుపెట్టినట్టూ అవుతుంది. ఒక దెబ్బకు రెండు పక్షులు. అందుకే తన తత్త్వాన్ని మభ్యపరచి చివరిదాకా సాగిస్తూ వచ్చిన మహాభినయమిది. తనకు కాకపోయినా లోకానికలాగే కనపడాలి గదా. అలా కనపడటంవల్లనే తనకు సుగ్రీవాదులందరూ సాయపడుతూ వచ్చారు. రావణుడు మానవుడేకదా అనే నిర్లక్ష్యంతో బరవసాపడి మోసపోయాడు.

  ఏమి అలా మభ్యపరుచుకోవలసిన అవసరమేమిటి ? కృష్ణుడిలాగా తన వైభవాన్ని బయటపడి ప్రదర్శించనే వచ్చుగదా ! అంటే భాగవతం మాదిరిగాదు. రామాయణం. భాగవతం పురాణమైతే రామాయణ మితిహాసం. పురాణం మోక్షపురుషార్థాన్ని బోధిస్తుంది. ఇతిహాసమలాకాక ధర్మపురుషార్థాన్ని ప్రధానంగా బోధిస్తుంది మనకు. ధర్మపురుషార్థమన్నప్పుడది చెప్పేదిగాదు. చేసి చూపేది. ఆ చూపటం తనకోసం గాదు. మానవులకోసం తాను చేసేది చూచి మానవులందరూ అలాగే చేయాలని తాత్పర్యం. ఇది మోక్షంలాగా ఏ కొందరుత్తమాధికారులకో నియతమయింది కాదు. ధర్మమనేది సర్వలోక సాధారణం. అది లోకులకు బోధించాలంటే యద్యదా చరతిశ్రేష్ఠః అన్నట్టు తానాచరించి చూపాలి. అందుకోసం అద్భుతమైన లీలలు, మహిమలు ప్రదర్శిస్తే లాభంలేదు. అవన్నీ మానవుల కతీతమైనవి. జీవితంలో వారికవి ఉపయోగపడవు. కనుక ఆయా వర్ణాశ్రమాల వారి కాయాలింగవయోవస్థాదుల కనుగుణంగా ఎవరికేది విహితమో, హితమో అలాంటి ధర్మం వారికి బోధిస్తూ అందుకు తన జీవితమే ఒక ఆదర్శంగా చూపుతూ వచ్చాడు పరమాత్మ. అందుకే ఏయే సందర్భాలలో మానవుడెలా ప్రవర్తిస్తాడో ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు. అదంతా మానవ స్వభావానుకరణమేగాని నిజమైన ఆచరణంకాదు. నర్తకుని భంగిపెక్కగుమూర్తులతో నన్నట్టు ఒక నటుని లాంటివాడు పరమాత్మ. ఏ వేషం వేస్తే ఆ వేషాని కనుగుణంగా నటిస్తూ పోతాడు. కృష్ణవేషం వేసుకొని మోక్షపురుషార్థాని కనుగుణంగా ఆయా లీలలు ప్రదర్శిస్తూ వచ్చాడు. రామవేషం వేసుకొని ధర్మపురుషార్థాని కుచితంగా ఒక ఉత్తమ మానవుడిగా ఉత్తమ ధర్మాలను ప్రవచించాడు లోకానికి. లోకం కోసమేగాని ఈ వ్యవహారం తనకోసంగాదు. నానవాప్త మవాప్తవ్యమని ఏ కోరికా లేనివాడికి ఏ వ్యవహారంగానీ

Page 145

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు