ఉక్కిరి బిక్కిరి అయిన రావణుడికి తాను విద్రావణుడు కావటమొక ఆశ్చర్యమా ? ఆ శ్వేతద్వీపమెవరిది ? క్షీరసాగరశాయి అయిన తనదేగదా. ఆ విలాసినులెవరు ? తన సహ వాసినులే గదా. అందుచేత పూర్వ వృత్తాంత కథ నవ్యాజంతో అగస్త్యుడు జ్ఞాపకం చేస్తే తచ్ఛవణవ్యాజంతో తన వైభవం తానే స్మరిస్తూ సంతసించటమే ఇదంతా. చుట్టూ ఉన్న హనుమదాదులను సంతసింపజేయటమే. కడపట లోకాపవాదమనే పేరుతో సీతను పరిత్యజించటమూ, ప్రతిజ్ఞ అనే మిషతో లక్ష్మణుణ్ణి దేశంనుంచి బహిష్కరించటమూ కూడా యముడికి తాను చేసిన వాగ్ధానాని కనుగుణంగా త్వరలోనే వైకుంఠాన్ని చేరటాని కేర్పరచుకొన్న ప్రయాణ సన్నాహమే. మరేదీగాదు.
ఈ విధంగా చూస్తూపోతే రామాయణ మాద్యంతాలలోనే గాక మధ్యవర్తి అయిన కథా భాగాలనెక్కడెక్కడ తడవి చూచినా కథానాయకుడు మన మనుకొన్నట్టు ప్రాకృత మానవుడు కాడని సాక్షాత్తూ పరమాత్మేనని చెప్పకుండానే తెలిసిపోతుంది. శబరీ శరభంగ సుతీక్షాదులను తరింపజేయటమే గాదు, జటాయువుకు పుణ్యలోకాలు ప్రసాదించటమేగాదు, విరాధాదులకు శాపమోక్ష మనుగ్రహించటమే కాదు, కాకాసురుణ్ణి ముప్పుతిప్పలు పెట్టి మూడు లోకాలు తిప్పటమేగాదు, మరి సప్తసాలై కకాల విభేదనాపాది బాణ ప్రయోగమే గాదు, ఇలాంటి అతి మానుష చర్యలే కొన్ని చూచినా దాఖలా అవుతుంది రాముని దివ్యస్వభావం. అయితే ఒక్కమాట. పరమాత్మే అయి కూడా ఆయా సందర్భాలలో మనబోటి జీవులకంటే కూడా దీనంగా పామరంగా ఎందుకు ప్రవర్తించాడాయన, ఏమి అవసరమని ప్రశ్న. దానికాయనే ఇచ్చాడు సమాధానం. ఆత్మానమ్ మానుషమ్మన్యే అని మానవుడుగా జన్మిస్తానని మొదట దేవతలకు హామీ ఇచ్చాడు. వత్స్యామి మానుషే లోకే అని. అలాగే మనుష్యలోకంలో జీవించాడు. చివరకు 'వివేశ వైష్ణవంతేజ స్సశరీర స్సహానుజః' ఈ మానవ శరీరాన్ని వైష్ణవమైన తన దివ్యతేజస్సులో ప్రవిలయం చేసుకొని దివ్యమైన శరీరంతో వెలుగొందాడు. అదైనా ఎందుకని అడిగితే- అలాగైతేగాని రావణుడు వథ్యుడు కాడని సమాధానం. సృష్టిలో ఏ ప్రాణివల్లా చావగూడదని పరమేష్ఠివల్ల వాడు పొందిన వరం. అందులో మానవుడిదేమిలే అని వాడి సంగతి ఏమాత్రమూ పట్టించుకోలేదా దానవుడు. మరి వాణ్ణి చంపాలంటే మానవుడుగా జన్మించాలి
Page 144