#


Index

రామ యాథాత్మ్యము

ఇంద్రుడు యుద్ధభూమిలో చనిపోయిన వానరులనందరినీ ఆయన ప్రీత్యర్ధం మరలా బ్రతికిస్తాడు. ఆయన ప్రీత్యర్థమేమిటి. అది తన ప్రీత్యర్ధమే. వారంతా ఎవరా వానరులు. తన పరివార దేవతలే గదా. తరువాత పుష్పకారూఢుడై బంధుమిత్ర పరివార సమేతంగా సాకేతపురానికి రావటం మహావైభవంగా పట్టాభిషేకం చేసుకోవటం దానికి ఋష్యాదులంతా విచ్చేయటం ఇదంతా ఒక విధంగా భగవద్విభూతి ప్రదర్శనమే. దానికొక నిదర్శనమే.

  మరొక విశేషమేమేంటే పట్టాభిషేకానంతరం అగస్త్యాదులందరూ వచ్చి తన్ను శ్లాఘిస్తుంటే ఏదో ప్రసంగవశాత్తూ అడిగినట్టు పైకి నటిస్తూ తన ప్రత్యర్ధి అయిన రావణాదుల పూర్వ వృత్తాంతాన్ని అడిగి తెలుసుకోటం. ఉత్తరకాండలో సగభాగమదే. పూర్వం రామాయణమైతే ఉత్తరం రావణాయనం. ప్రత్యర్థి అని పేరేగాని వాడూ తనవాడేగా. తన ద్వారపాలకుడే. పాపం ఏదో శాపం కారణంగా వచ్చి పడ్డాడీ లోకంలో. తనతో శత్రుత్వం వాడు నటిస్తే తానూ నటించాడు. చివరకు తన వల్లనే శాపమోక్షమై వెళ్లిపోయాడు వాడు. తీగ కదిలిస్తే డొంక కదలినట్టు అతడి చరిత్ర లోతుకు దిగితే అది మరొక విధంగా తన చరిత్రే అయినా ఆశ్చర్యంలేదు. అయింది కూడా. వాడు కైలాసంలో నందితో కలహించి శాపం పాలయ్యాడన్నా తన వంశీయుడైన అనరణ్యుడి శాపానికి గురి అయ్యాడన్నా, కడకు వేదవతిని బలాత్కరించబోయి యోగానల దగ్ధ అయిన ఆవిడచేత శాపం నెత్తికి తెచ్చుకొన్నాడన్నా, రంభా కామసంరంభంలో నలకూబరుడిచేత శప్తుడయ్యాడన్నా, అదంతా అతణ్ణి వధించటానికి తాను అవతరించక తప్పదనే రహస్యం చెప్పటానికే. దానికోసం ఒక పూర్వరంగాన్ని సిద్ధం చేయటానికే కాకపోతే మరెందుకీ ప్రస్తావన అంతా. ఇంకా తడవి చూస్తే రావణుడు వాలిచేతిలో పరాభవం పాలుకావటం కార్తవీర్యుడి చేతిలో అవమానితుడు కావటం, ఇవికూడా భంగ్యంతరంగా రాముడి లోకోత్తర పరాక్రమాన్నీ, లోకోత్తరమైన ఆయన అవతారతత్త్వాన్ని చాటి చెప్పటమే. ఆ వాలి నొక్క బాణంతో అవలీలగా వధించాడు. ఆ కార్తవీర్యుడి వేయిచేతులూ నరికిన పరశురాముణ్ణి బాణమింకా విడవకుండానే నిర్వీర్యుణ్ణి చేశాడాయె తాను. ఇక వాలిచేతిలో ఓడిపోయిన రావణుణ్ణి జయించటమేమి ఆశ్చర్యం. అదే ఆశ్చర్యం కాకపోతే శ్వేతద్వీప నివాసినులైన విలాసినుల చేతిలో చిక్కి ఒక బక్క కోతిలాగా

Page 143

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు