శంకచక్రగదాధరః మానుషం వపురాస్థాయ - విష్ణుస్సత్యపరాక్రమః సర్వైః పరివృతోదేవైః వానరత్వముపాగతైః లోకానాంహితకామ్యయా - సరాక్షసపరీవారమ్ హతవాంస్త్వామ్ మహాద్యుతిః” - ఆ శంఖ చక్ర గదాధరుడైన లక్ష్మీవరుడే వానరరూప ధరులై న దేవతల నందరినీ వెంట బెట్టుకొని శ్రీరాముడనే పేరుతో మానవరూపాన్ని ధరించి వచ్చి అనన్య వధ్యుడవైన నిన్ను చివరకు వధించి వెళ్లాడని విలపిస్తుంది. చూడండి. విలాపంచేస్తూ అన్నా ఆవిడనోట వచ్చిన ఈ మాటలెంత సత్యాన్ని మనకు చాటి చెబుతున్నాయో ? మహాపతివ్రత నోట వచ్చింది సత్యంగాక అసత్యమెలా అవుతుంది. ఎంత కాలం నుంచో తన హృదయంలో దాగి ఉన్న పరమసత్యాన్నే వెళ్లగ్రక్కిందా మహాతల్లి.
పోతే వీటన్నిటికీ మకుటాయ మానమైన సన్నివేశం ఆఖరుసారిగా సీతాగ్నిప్రవేశం. అగ్నిదేవుడే స్వయంగా ఆవిడను రాముడికి తెచ్చి సమర్పిస్తాడు. వెంటనే అంతరిక్షంలో బ్రహ్మేంద్రాది దేవతలంతా స్వస్వరూపాలతో సాక్షాత్కరిస్తారు. రాముడి విరాడ్రూపాన్ని వేనోళ్ల కీర్తిస్తారు. అంతా విని రాముడు ఆత్మానమ్ మానుషమ్మన్యే రామందశరథాత్మజమ్. నేను దాశరథి అయిన రాముడను నన్ను నేను మానవుడననే భావిస్తున్నాను. మీరేమిటి నన్ను భగవానుడంటున్నారు. అది ఎలాగో వివరించమని అడుగుతాడు. చూడండి. ఎంత ధూర్తత్వమో ఇది. భగవంతుడని తనకు తెలియదట. మానవుడనే అని అనుకొంటున్నాడట. వారు చెబితే తెలుసుకోవాలని ఉందట. ఒకరు చెప్పటమేమిటి. తానేగా మానవలోకంలో మానవుడుగా అవతరిస్తానని దేవతలతో చెప్పి వచ్చాడు. అప్పుడే మరిచిపోయాడా? మరిస్తే పరమాత్మ ఎలా అవుతాడు. సరిగా ఇక్కడ కృష్ణుడు మాట్లాడుతున్నట్టుంది గాని రాముడు మాట్లాడుతున్నట్టు లేదు. ఆ నటనే ఈ నటన అని చెప్పటానికింతకన్నా మంచి ఘట్టం మరొకటి కానరాదు. అందుకేనేమో బ్రహ్మ వెంటనే అందుకొని భవాన్నారాయణోదేవః అజితః ఖడ్గభృద్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః అని కృష్ణనామంతో కూడా సంబోధిస్తాడా ఆది దేవుణ్ణి. సహస్ర చరణః శ్రీమాన్ - శతశీర్షస్సహస్రదృక్ అని విరాడ్రూపాన్ని మరోమారు కీర్తిస్తాడు. మహేశ్వరుడు కూడా అలాగే స్తుతిస్తాడు. ఆఖరుకు తండ్రి దశరథుడుకూడా వారితో పాటు ఆయనకు దర్శనమిచ్చి నీ అరణ్యగమనాదికంలోని అంతరార్థమంతా ఇప్పటికినాకు బోధపడిందని నివేదిస్తాడు.
Page 142