పోతే ఇక హనుమంత్పునరాగమనానంతరం సేనా సహితుడయి సముద్రతీరం చేరి సముద్రుణ్ణి దారి ఇవ్వమని కోరి అతడు పలకకపోతే దానిపైన బ్రహ్మాస్త్రం సంధిస్తాడు. దానితో సముద్రుడేగాక త్రిలోకాలూ అకులమై పోతాయి. అతడు భీతభీతుడై వచ్చి దాసుడి తప్పు మన్నించమని ప్రాధేయపడతాడు. ఇక్కడ దాఖలా అవుతుంది రాముడి దివ్య స్వరూపం మనకు. మామూలుగా బయటపడదది. మానుష వేషంలో మరుగుపడి ఉంటుంది. ఎప్పుడో సమయంచూచి పడగ విప్పుతుంది. అప్పుడర్ధమవుతుంది దాని ప్రభావం మనకు. విభీషణుడు హఠాత్తుగా వచ్చి శరణు వేడటం, సుగ్రీవాదులను సలహా అడగటం వారు వద్దని చెప్పినా శరణాగత రక్షణం, తన కర్తవ్యమని చెప్పి అతని నాదరించటం, ఇదంతా ఒక అభినయమే. అంతేకాదు. ఇంకా లంకలో ప్రవేశించింది లేదు. రావణ సంహారం చేసిందిలేదు. అప్పుడే అంతా జరిగిపోయినట్టు విభీషణుడికి లంకా రాజ్యాభిషేఖం చేస్తాడు. ఇది మరీ సాహసం. అల్పజ్ఞుడైన మానవుడికైతే సాహసం. సర్వజ్ఞుడైన పరమాత్మ. సర్వజ్ఞుడు గనుకనే రావణుడు చస్తాడని తెలుసు. తాను గెలుస్తానని తెలుసు. గెలిస్తే ఇక దానవ రాజ్యానికి విభీషణుడే వారసుడనీ తెలుసు. అలా తెలిసే చేశాడనుకోవాలి ఈ అభిషేకం.
అనంతరం యుద్ధకాండలో ఇంద్రజిత్తువల్ల అన్నదమ్ములిద్దరూ నాగపాశబద్ధు లవుతారు. అప్పుడు అంతరిక్షం నుంచి గరుత్మంతుడే స్వయంగా వచ్చి పాశచ్ఛేదంచేసి వెళ్లిపోతాడు. ఇదికూడా రాముడి విష్ణుతత్త్వానికి నిదర్వనమే. అంతేకాదు. రావణుడితో పోరాడే సందర్భంలో దేవసారథిమాతలి స్వయంగా ఒక దివ్యమైన రథం తీసుకు వస్తాడు రాముడి దగ్గరకు. ఇదీ తార్కాణమే మనకు. అంతేకాదు. రావణ వధానంతరం యుద్ధభూమికి మందోదరి వచ్చి ఆక్రందన చేస్తూ ఇలా అంటుంది. కథమ్ జఘానత్వాం - మానుషోవనగోచరః ఒక మానవుడు నిన్ను వధించటమూ, నేను నమ్మలేను. యదైవ చ జనస్థానే - రాక్షసైర్బహుభిర్వృతః ఖరస్తవహతోభ్రాతా తదైవాసౌమానుషః - యదైవ వానరైరోరై ర్బద్ధస్సేతుర్మ హార్ణవే తదై వహృదయేనాహం శంకేరామమమానుషమ్. జనస్థానంలో ఖరదూషణుల నంతమంది సైన్యంతో సహా అంతమొందించాడంటేనే రాముడు మానవమాత్రుడు కాడు. అపారమైన సాగరంమీద అంత పెద్ద వంతెన నిర్మించి వచ్చాడంటేనే మానవుడు కాడు. అయితే మరెవడు, “వ్యక్త మేషమహాయోగీ - పరమాత్మా సనాతనః తమసః పరమోధాతా
Page 141