చేసుకొంటున్నాడు. వారు కేవలం నిమిత్తమాత్రులే. కనుకనే ఎవరేది చెప్పినా తనకేది చేతికిచ్చినా మౌనంగా వింటూ మౌనంగానే స్వీకరిస్తూ వచ్చాడు. తన ప్రణాళిక వారు సూచిస్తుంటే తనలో తాను సంతోషిస్తున్నాడు. ఇప్పుడూ అంతే. వాలి సుగ్రీవు లిద్దరిలో వాలి పరాక్రమశాలి అయినా మంచివాడు కాడు సుగ్రీవుడే స్నేహపాత్రుడని చెబితే అదేమిటి బలవంతుడితోనే గదా సఖ్యం చేయవలసిందని ప్రశ్నించకుండా అలాగేనని కిష్కింధకు బయలుదేరుతాడు. అక్కడ హనుమంతుడు సుగ్రీవ ప్రేషితుడయి వచ్చి పలకరిస్తే అతణ్ణి తానెప్పుడూ చూడకపోయినా ఎంతో పరిచయమున్నవాణ్ణిలా చూస్తాడు. అతడి గుణగణాలన్నీ తమ్ముడికి వర్ణించి చెబుతాడు. ప్రశంసిస్తాడు. భగవంతుడికి పరిచయమేమిటి. అపరిచయమేమిటి. దుర్లభోహీదృ శోబంధుః అని సుగ్రీవుణ్ణి పేర్కొనటంలో వాలి తనకుశత్రువని చాటినట్టయింది. వాలి తనకేమి అపకారం చేశాడని శత్రువయ్యాడు. అది భగవానుడికే ఎఱుక. నీకూ నాకూ తెలిసే విషయంకాదు. తరువాత దానిపాటికదే బయటపడుతుందీ రహస్యం. కాదు కాదు. ఆయన మౌనచర్యే మనకు బయటపెడుతుంది.
పోతే సీతాన్వేషణార్థం ఎంతోమంది ఎన్నో దిక్కులకు పయనమయ్యారు. హనుమదాదులు మాత్రమే దక్షిణ దిశగా వెళ్లారు. దక్షిణ దిశలోనే లంక ఉందని అక్కడే సీత ఉందని - అంతమాత్రమే. తెలుసునందరికీ. కాని రాముడికింకా ఒక విశేషం తెలుసు. ఆ సీతను వెదకి చూడగలవాడు హనుమంతుడొక్కడేనని. వ్యవసాయశ్చ తేవీర సత్త్వ యుక్తశ్చ విక్రమః సుగ్రీవస్యచ సందేశః సిద్ధిం కథయతీవమే - నాయనా నీ ధైర్యమూ, నిశ్చయమూ, పరాక్రమమూ, సుగ్రీవుడికి నీమీద ఉన్న విశ్వాసమూ చేసే నీవే కార్యం సాధించగలవని తోస్తున్నది. ఇదుగో నా నామాంకితమైన అంగుళీయకం - సీతా అభిజ్ఞానార్థమని చెప్పి చేతికిస్తాడు. ఇవన్నీ పయిమాటలు. తప్పకుండా హనుమంతుడే సాధిస్తాడని సర్వజ్ఞుడైన రాముడికెప్పుడో తెలుసు. కనుకనే అంతమందిలో ఆయనకే ఈ అంగుళీయక ప్రదానం. మార్గమధ్యంలో స్వయంప్రభా వృత్తాంతమూ, సముద్ర మధ్యంలో సురసా సింహికా గర్వభంగమూ, లంకలో లంకిణీ సంహారమూ ఇవన్నీ తట్టుకొని నిలిచేశక్తి హనుమంతుడికే ఉందని ఎప్పుడో గ్రహించి ఉంటాడు రాముడు. అందుకే ఈ అంగుళీయక ప్రదానం.
Page 140