#


Index

రామ యాథాత్మ్యము

రాక్షసాకీర్ణమైన చోటికి వెళ్లమని అగస్త్యుడెందుకు సలహా ఇచ్చాడో ఇప్పుడర్థమయింది. ఇక్కడే ఉన్నారు ఖరదూషణాది రాక్షసులంతా. వారంతా రావణుడి పరివారం. తప్పకుండా వారితో ఘర్షణ ఏర్పడుతుందక్కడ ఉంటూ ఉంటే తద్ద్వారా రావణుడికి వారి వృత్తాంతం తెలిసిపోతుంది. చివరకు వాడితోనూ పోరాటం రాకతప్పదు. ఇదంతా ఊహించే అగస్త్యుడాయుధాలిచ్చాడు. రాముడు మౌనంగా పరిగ్రహించాడు. ఆయన సలహామేర కక్కడికే వచ్చి పర్ణశాల వేసుకొని స్థిరంగా అక్కడ కాపురమున్నాడు. ఈ మౌనచర్యలో ఎంత మర్మమున్నదో చూస్తే మన కాశ్చర్యం వేస్తుంది.

  ఇంకా ఆశ్చర్యమేమంటే ఖరదూషణాదులెక్కడ తనమీది కెత్తి రారోనని శూర్పణఖతో ఎకసక్కాలాడి దానికి కోపం తెప్పించి లక్ష్మణుడిచేత దాని ముక్కు చెవులు కోయించి పంపటం. అది సరాసరి వెళ్లి ఖరదూషణాదులను యుద్ధానికి పురికొల్పింది. తద్వధానంతరం మరలా అదేగదా రావణుణ్ణి ప్రేరేపించింది. మరి వాడు వస్తేగాని సీతాపహరణం జరగదు. అందుకు నిమిత్తం మారీచుడు కావలసి ఉంది. అదిముందుగా తెలిసే తాను బాల్యంలో సుబాహుణ్ణి చంపినా వాణ్ణి మాత్రం చంపకుండా దండకలో పారవేయటం, పూర్వాపరాలు కలిపి చూచుకొంటే ఎంత నాటకమాడాడో చూడండి రాముడు. త్రికాలదర్శి భగవానుడు కాకుంటే ఆడగలడా ఈ నాటకం. పైగా సీత ఆ మృగాన్ని చూచి ప్రలోభపడటం, దాన్ని పట్టి తెమ్మని తన్ను బలవంతం చేయటం, అలాంటి అద్భుతమైన మృగమెక్కడా ఉండదని చెబుతూనే దాన్ని ఆమె కోసం పట్టి తెస్తానని పంతగించటంకూడా వింతగానే ఉంది. లక్ష్మణుడిదంతా రాక్షస మాయ అని చెప్పినా మాయ అయితే మరీ మంచిది దాన్ని ఛేదించటంకూడా మన కర్తవ్యమే గదా అని తన చర్యను సమర్ధించబూనటం కూడా చిత్రమే. చిత్రమే మరి. భగవల్లీలలన్నీ చిత్రమే మనపాలిటికి.

  తరువాత సీతా వియోగంవల్ల ఏర్పడిన పరితాపమింతా అంతాగాదు. అంతకు ముందంత బరవసా. ఆ తరువాత ఇంత వేదనా, ఇదీ ఒక లీలే, ఒక ప్రదర్శనే. ఇంతలో కబంధ ప్రతిరోధమూ, అతడి శాపవిమోచనమూ, సుగ్రీవుడితో సఖ్యం చేయమని బోధించటమూ, ఇది కూడా భావిసూచనే. శరభంగుడి దగ్గరినుంచీ ప్రతి ఒక్కరూ ముందుకు నడుపుతూనే ఉన్నారు తన్ను. తన అవతార ప్రయోజనాన్ని తనకు గుర్తు చేస్తూనే ఉన్నారు. వారు చేయటంకాదు. వారిద్వారా తనకు తానే

Page 139

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు