కర్తవ్యమూ అదే రాముడికి. అంతేకాదు. ఆయనదగ్గర తనకు కావలసిన అస్త్రశస్త్రాదులెన్నో ఉన్నాయి. అవన్నీ రాముడి కప్పగిస్తాడాయన. ఇదమ్ దివ్యమ్ మహచ్చాపమ్ - హేమరత్నవిభూషితమ్ - వైష్ణవం పురుషవ్యాఘ్ర - నిర్మితం విశ్వకర్మణా - అమోఘస్సూర్య సంకాశో - బ్రహ్మదత్తశ్శరోత్తమః - దత్తామమ మహేంద్రేణ – తూణీచాక్షయ సాయకే. మహారజత కోశోయమసిః ఇవిగో వైష్ణవమైన ధనుస్సు, బ్రహ్మదత్తశరం, అక్షయబాణ తూణీరాలు, ప్రచండమైన ఖడ్గం. అనేన ధనుషా రామహత్వాసంఖ్యే మహాసురాన్ ఆజహరశ్రియం దీప్తాం పురావిష్ణుర్దివౌకసామ్ జయాయ ప్రతిగృహ్లిప్వ ఈ ధనుర్బాణాదులతో పూర్వం విష్ణుదేవుడు రాక్షస సంహారం చేసి దేవతలకు వారి స్వర్గరాజ్యాన్ని మరలా తెచ్చి ఇచ్చాడు. నీకు కూడా విజయం కలగాలని వీటిని నీకర్పిస్తున్నాను. స్వీకరించమని ఇస్తాడు. రాముడు మాట్లాడకుండా ఇచ్చిందే తడవుగా ప్రతిగ్రహిస్తాడు. ఏమిటీ వ్యవహారం, అగస్త్యుణ్ణి చూడాలనుకొన్నదిందుకా తాను. శరభంగ సుతీక్షాదులను దర్శిస్తూ వారిని వీరినడుగుతూ రావటమిందుకే నన్నమాట. తన పూర్వాయుధ సామగ్రిని మరలా తాను పరిగ్రహించటానికే. అవి అగస్త్యుడి దగ్గర న్యాసమున్నాయని తెలుసు ఆయనకు. తనకోసమే ఆయన దాచాడనీ తెలుసు తనకోసం కాకపోతే ఆ ముసలాయనకు వాటితో ఏమిపని. పైగా విష్ణువు పూర్వం వాటితోనే రాక్షస సంహారం చేశాడట. అవే తనకూ కావలసి వచ్చాయట ప్రస్తుతం. రాముడు భగవదవతారమని ఇక వేరుగా నిరూపించాలా ? ఈ ఒక్క సన్నివేశం చాలదా ? చమత్కారమేమంటే అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు అమాయికత్వం నటించటంలో ఉంది కథానాయకుడి ధూర్తత్వం. ఇది కృష్ణపాత్రకన్నా ఎక్కువ ధూర్తత్వం.
తరువాత పంచవటికి వెళ్లి అక్కడే నివసించమని సలహా ఇస్తాడు మహర్షి ఆయుధాలివ్వటం అక్కడికి వెళ్లి ఉండమని చెప్పటం, ఇది కూడా భాహ్యర్థ ద్యోతకమే. అంతేకాదు. అక్కడికి వెళ్లారో లేదో జటాయువు ప్రత్యక్షమవుతుంది. అది నేను మీకు సహాయంగా ఉంటానంటుంది. ఇదం దుర్గంహి కాంతారం - మృగరాక్షస సేవితం - సీతాంచాపిరక్షిష్యే - త్వయియాతే సలక్ష్మణే - ఇది మహారణ్యం. రాక్షస సంచారమెక్కువగా ఉంటుందిక్కడ. ఎప్పుడైనా నీవు లక్ష్మణుడితో ఎక్కడికైనా వెళ్లినా నేను నీదేవిని సీతను కాపాడుతానంటుంది. ఎంత సాభిప్రాయమైన మాటిది. ఇంత
Page 138