#


Index

రామ యాథాత్మ్యము

అక్కడ సీతకు అనసూయదేవి దివ్యాలంకారాలు ప్రసాదిస్తుంది. ఆవలవారు దండకారణ్యం ప్రవేశిస్తారు. అక్కడ విరాధుడనే రాక్షసు డడ్డగిస్తాడు వారిని. వాడు తుంబురుడనే గంధర్వుడు. శాపగ్రస్తుడయి అలా జన్మించాడు. వాణ్ణి శపించిన కుబేరుడు రామదర్శనమైతే చాలు నీకు శాపమోచన మవుతుందని చెబుతాడు. రాముడివల్ల ముక్తశాపుడయి వాడు శరభంగముని దగ్గరికి వెళ్లండని చెప్పి తిరోహితుడవుతాడు. మరి ఇలా విరాధుడు ఆయన చేతిలో శాపముక్తుడు కావాలన్నా శరభంగుడు ఆయనగారి దర్శనంచేసి తరించాలన్నా అది భగవదవతారం కాకపోతే ఎలాగా. తత్ప్రయోజనార్థం రాజ్యపరిత్యాగం చేసి అరణ్యగమనం చేయకపోతే ఎలాగ. అందుకు నిదర్శనమే ఇదంతా. మరి ఆ తరువాత అక్కడి తాపసులంతా వచ్చి రాక్షసులవల్ల తమకు కలిగే ఉపద్రవాలు మనవి చేసి మమ్ములను కాపాడమంటే ఇలా అంటాడు రాముడు వారితో. భవతా మర్థసిద్ధ్యర్థమ్. ఆగతోహంయదృచ్ఛయా తస్యమేయంవనేవాసో భవిష్యతి మహాఫలః - మీ కార్యం సాధించటానికే నేనసలీ అరణ్యాలకు వచ్చాను. ఇక్కడ నా నివాసానికి తగినంత ఫలం తప్పకుండా కలిగి తీరుతుంది. చూడండి. ఎంత గూఢమైన భావమో ఇది. తండ్రి మాట నిమిత్త మాత్రమే గాని నిజంగా తాను వచ్చింది కేవలే నాత్మ కార్యేణ అని ఆయన అన్నట్టే తన పని కోసమే. అంటే దుష్టశిక్షణ కోసమే వచ్చాడు. ఆ పని సాధించటమే తన కర్తవ్యం అంటే భగవత్ ప్రయోజనమదే ననిగదా అర్థం.

  శరభంగుడు సుతీక్షుడి దగ్గరికి వెళ్లమని చెప్పటం, సుతీక్షుడాయన కాతిథ్యం చేసి మళ్ళీ ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పటం, రెండూ భాహ్యర్థ సూచనే. మరలా కొంతకాలానికి సుతీక్షుడి దర్శనం చేసుకుంటాడు రాముడు. కొన్నాళ్లక్కడ ఉండి ఒకరోజు ఆయనను అడుగుతాడు ఆగస్త్యుని ఆశ్రమమెక్కడో చెప్పమని. ఆయనగారే సూచిస్తాడు ఫలానాచోట అని. తరువాత మరొక విశేషమేమంటే ధర్మభృదాదులైన ఋషులెవరు తనకు తటస్థపడినా అగస్త్యులవారి ఆశ్రమమెక్కడ వారిని చూడాలని అడుగుతూ పోతాడు రాముడు. మనోరథో మహానేష - హృదిమే పరివర్తతే. ఎంతో కుతూహలంగా ఉందట తన కాయనను చూడాలని. దీనికంతా ఒక గూఢమైన కారణమున్నది. అది అగస్త్యుడి దగ్గర బయటపడుతుంది. ఆ మహర్షి చాలామంది క్రూరరాక్షసులను వధించినవాడని సుతీక్షాదులు చెబుతారు. తన

Page 137

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు