#


Index

రామ యాథాత్మ్యము

మాట మాటాడడు రాముడు. చూడబోతే ఇవన్నీ ముందే తనకు తెలుసునన్నట్టు ఇలాగే జరగబోతుందన్నట్టు తోస్తుంది మనకు. పోతే కందర్పుడి ఆశ్రమం దగ్గరికి వచ్చినప్పుడే నోరు దెరచి మాటాడాడాయన. ఇది ఎవరి ఆశ్రమం చెప్పమని అడుగుతాడు. ఫలానా అని చెబుతాడాయన. ఆ రాత్రి అక్కడే ఉంటారంతా. అక్కడ ఉన్న మహర్షులంతా వచ్చి వారిని పూజిస్తారు. తెల్లవారి గంగా తరణం చేస్తుంటారు గురుశిష్యులు. అప్పుడు మరలా అడుగుతాడు రాముడు. ఈ జలమధ్యంలో ఈ తుములమైన శబ్దమేమిటని. దానికి మానస సరస్సరయూ వృత్తాంతాన్ని చెబుతాడు మహర్షి. తరువాత తాటకా సంహారం, సిద్ధాశ్రమ ప్రవేశం జరుగుతాయి. తాటకను వధించాలని ఉన్నా స్త్రీవధ చేయటం ధర్మమా అధర్మమా అని ప్రశ్నించటం ఆయన ధర్మమేనని చెబితే వధించటం ఇదికూడా ఒక చమత్కారమే. తెలిసీ తెలియనట్టు నటించటం భగవానుడికొక వినోదం. మారీచ సుబాహులలో సుబాహుణ్ణి చంపి మారీచుణ్ణి దూరంగా దండకారణ్యంలో విసరివేయటం కూడా సాభిప్రాయమే. భావి సీతాహరణ వృత్తాంతం తప్పక జరగాలనే అలా చేశాడని చెప్పుకోవలసి ఉంటుంది.

  మరి యజ్ఞరక్షణానంతరం మిథిలకు తరలిపోవటంలో కూడా ఒక చమత్కారముంది. ఆజ్ఞాపయ యథేష్టం వైశాసనం కరవావకిమ్ ఇంకా మేము చేయవలసిన పనేముందో ఆజ్ఞాపించమంటాడు. ఆయన మిథిలా పురానికి వెళ్లుదాము. అద్భుతమ్ చధనూరత్నం, తత్రైకమ్ ద్రష్టుమర్హసి, కర్తుమారోపణేశక్తా, నకథంచన మానుషాః అక్కడ ఒక గొప్ప ధనుస్సున్నది. లెక్కపెట్టలేరు. అదికూడా మానవమాత్రులు ఎక్కుపెట్టలేరు. అది కూడా చూడవచ్చు లెమ్మంటాడు. మానవమాత్రు లెక్కుపెట్టలేరంటే ఏమిటర్ధం. రాముడుకూడా మానవుడు కాడనా అవుననా. అయితే ఎలాగూ ఎక్కుపెట్టలేడిక తీసుకెళ్లటం దేనికి. ఇక్కడే ఉంది మర్మం. కాడు గనుకనే ఆ విషయం తెలుసు గనుకనే తీసుకెళ్ళాడు ఆచార్యుడు. శిష్యుడికీ తెలుసు తాను మానవుణ్ణి కానని. కనుకనే ధైర్యంగా వెళ్లాడాయన వెంట. మార్గమధ్యంలో రాముడడుగుతుంటే చెబుతూనే పోతాడెన్నో కథలు. కుశనాభుడి కథా, తనవంశ కథా, ఉమాగంగావతరణ కథా, కుమార సంభవ కథా, సాగరవృత్తాంతమూ, గంగావతరణమూ, సముద్ర మథన వృత్తాంతము, ఒకటిగాదు. అనేక కథా వృత్తాంతా లేకరువు పెడుతూ వస్తాడు. రాముడన్నీ ఆలకిస్తుంటాడు.

Page 130

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు