హత్వాక్రూరమ్ దురాత్మానమ్ దేవర్షీణామ్ భయావహమ్, దశవర్ష సహస్రాణి, దశవర్ష శతానిచ, వత్స్యామిమానుషేలోకే, పాలయన్ పృథివీమిమామ్, క్రూరుడైన ఆ రావణుణ్ని రూపుమాపి ఆ తరువాత కూడా పదకొండు వేల సంవత్సరాలదాకా ఈ భూమండాలాన్ని పాలిస్తూ అక్కడే ఉండిపోతానని భవిష్య ద్వృత్వాంతాన్ని కూడా ముందుగానే సూచిస్తాడు. తదనుగుణంగానే కృత్వాత్మానమ్ చతుర్విథమ్ పితరంరోచ యామాసతదా దశరథమ్ నృపమ్ తన ఒకే ఒక రూపాన్ని నాలుగు రూపాలుగా మలుచుకొని రామలక్ష్మణ భరత శత్రుఘుల్ననే నలుగురు సోదరులుగా అవతరించాడని ఉంది.
అంతేకాదు. పరమాత్మ మీ కోసం మానవలోకంలో అవతరిస్తున్నాడు కాబట్టి మీరు కూడా ఆయనకు తోడ్పడడానికి ఆయా ఋషులకు అప్సరసలకూ వానరాది రూపాలతో జన్మించండి పొండని చతుర్ముఖుడు దేవతల నాజ్ఞాపిస్తాడు కూడా. పూర్వమేవమయా సృష్టో, జాంబవా నృక్షపుంగవః ఆవులిస్తుంటే అకస్మాత్తుగా నావక్త్రబిలం నుంచి జాంబవంతుడనే భల్లూక వల్లభుడు ముందుగానే ఆవిర్భవించాడు. పోతే మిగతా వాళ్ళనంతా మీ మీ అంశలలో సృష్టించమంటాడు. వారు సరేనని అలాగే సృష్టిస్తారు. అలా సృష్టి అయిన మహావీరులే వాలిసుగ్రీవ హనుమన్నల కుముదపనస గజగవయ గంధమాదనాదులంతా. వారంతా రెండు పాయలుగా చీలిపోయి కొందరు వాలిని కొందరు సుగ్రీవుణ్ణి సేవిస్తూ కూచుంటారు. బభూవ భూర్భీమ శరీర రూపైః సమావృతా రామసహాయహేతో: రామ సహాయార్థం జన్మించిన ఆ యోథవీరులందరిచేతా ఈ వసుంధర క్రిక్కిరిసి పోయిందట.
కాబట్టి గ్రంథారంభమే మనకు సాక్ష్యమిస్తున్నది రాముడు విష్ణ్వంశ సంభూతుడే నని. ఆరంభమేగాదు. అంతంలోకూడా మరలా మనకిలాగే తార్కాణమవుతున్నది. అదేమిటంటే రాముడింకా రాజ్యపాలన సాగిస్తుంటే బ్రహ్మాదులాయనకు స్వవిషయం జ్ఞాపకముందో లేదో తెలిపి రమ్మని యమధర్మరాజు నాయన దగ్గరకు పంపుతారు. అతడు సన్యాసి వేషంలో వచ్చి ఏకాంతంగా కలుసుకొని మాటాడుతూ పితామహుడి మాట విన్నవిస్తాడు. ఏమని కాలోయమ్ తే నరశ్రేష్ఠ, సమీపముపవర్తితుమ్, యది భూయో మహారాజ ప్రజా ఇచ్ఛస్యుపాసితుమ్, వసవావీర భద్రంతే, అధవా విజిగీషాతే సనాధావిష్ణునాదేవాః స్వామీ నీవీ కర్మభూమిలో ఉండి వస్తానని చెప్పిన గడువు
Page 127