ఎక్కడా పేర్కొనరాదు. అలా చెబితే అది ఒక పక్షి బొమ్మగీచి దాని క్రింద ఇది ఫలానా పక్షి అని దాని పేరు వ్రాసినట్టవుతుంది. ఫలానా పక్షి అని దాన్ని చూడగానే ప్రేక్షకులు గ్రహించాలి గాని చిత్రకారుడు ఫలానా అని చెబితేగాదు. చెప్పవలసి వచ్చిందంటే ఆ చిత్తరువులో దాన్ని గుర్తు పట్టకుండా చేసే లోపమేదో ఒకటి ఉందన్నమాట. అలాగే శృంగారాది రసాలను కూడా ఫలానా అని పేర్కొనటంకంటే విభావాది సామగ్రిని చక్కగా పోషిస్తే చాలు. దాని బలంతో భావుకుడైనవాడికా రసానుభవం కలిగి తీరుతుంది. అప్పుడా రసస్వరూపం కవి చెప్పకుండానే తెలిసిపోతుంది. ఇదే మహాకవి కుండవలసిన నైపుణ్యమూ, ప్రౌఢి.
అది వాల్మీకి మహర్షి కన్నా ఎక్కువ ఉన్న వాడెవడు సాహితీ ప్రపంచంలో. కనుకనే మహర్షి భగవచ్ఛబ్దాన్ని బాహాటంగా ఎక్కడా ప్రయోగించకపోయినా కథాగమనంలో దాన్ని సమయం వచ్చినప్పుడల్లా చాటుమాటుగా ధ్వనింపజేస్తూనే ఉన్నాడు. ధ్వని మార్గంలో నడచిన ఆ వ్యవహారమెలాంటిదో కావ్యారంభంనుంచి అరసి చూస్తే తెలుస్తుంది మనకందులోని గాంభీర్యం. ఉపక్రమోప సంహారాలలో ఏకవాక్యత (consistency) అనేది శాస్త్రానికే గాదు. కావ్యానికి కూడా ఆవశ్యకం. అప్పుడే కావ్యాత్మ అనేది పదహారు కళలతో మనకు కన్నులకు కడుతుంది. రామాయణాద్యంతాలలో ఇది ఐతిహాసిక మర్యాదలో కంఠోక్తిగానే చాటాడు మహర్షి కథానాయకుడు సామాన్యుడుకాదు లోకమాన్యుడైన భగవానుడేనని. చూడండి దశరథుడు ఋశ్యశృంగాదులు సహాయంతో పుత్రకామేష్టి సలుపుతుంటాడు. ఆ సందర్భంలో తమ తమ హవిర్భాగాల కోసం దేవతలంతా అంతరిక్షంలో గుమిగూడి సమయాని కక్కడికి వచ్చిన బ్రహ్మతో తమ గోడు విన్నవిస్తుంటారు. అతడిది విష్ణుదేవుని వల్లనే కాని మరొకరివల్ల సాధ్యమయ్యేది కాదని చెబుతూండగా విష్ణువే స్వయంగా వస్తాడక్కడికి. వారు నారాయణుడికి సాష్టాంగపడి రావణుడి వల్ల తమకు వాటిల్లిన కీడు బాపమని ప్రాథేయపడితే అలాగేనని మాట ఇచ్చి పుత్రకాముడైన దశరథుడికి రాముడనే పేరుతో అవతరించాడని గదా వర్ణించాడు కవి. పైగా మానవులవల్ల తప్ప మరెవరివల్లా చావులేకుండా వాడు వరం సంపాదించాడు కాబట్టి మానుష్యే చింతయామాస, జన్మభూమిమథాత్మనః మనుష్యలోకంలో మనుష్యుడుగానే జన్మించాలని సంకల్పించాడు. పైగా దేవతలతో ఇలా అంటాడా దేవదేవుడు.
Page 126