ఇలాంటివారు కూడా ఆయనకు ధైర్యం చెప్పవలసి వచ్చింది. స్వాస్థ్యం భద్రం భజస్వార్య - త్యజ్యతాం కృపణామతిః అని సీతా వియోగంతో అలమటిస్తుంటే లక్ష్మణుడు, అలంవైక్లబ్య మాలంబ్య, ధైర్యమాత్మగతంస్మర, త్వద్విధానామసదృశ, మీ దృశం విద్ధిలాఘవమ్, మాయాపి వ్యసనం ప్రాప్తం, భార్యహరణ జం మహత్, నచాహమేవం శోచామి, నచ ధైర్యం పరిత్యజే, అని సుగ్రీవుడూ, సుతిమెత్తని మాటలతోనే ఘాటుగా మందలిస్తారాయనను.
మొత్తానికిదంతా గమనించి చూస్తే కృష్ణుడిలాగా రాముడు లీలామానుషమైన అవతారం కాదని అది మానవోచితమైన జీవితమేనని మహా అయితే మానవులలోనే ఒక ఆదర్శప్రాయుడైన మానవోత్తముడి వ్యవహారమేనని తేటపడుతున్నది. దీనికి తగినట్టు వాల్మీకి మహర్షి ఎక్కడా తన కావ్యంలో రాముణ్ణి భగవంతుడని పేర్కొనడు. దాశరథిః కౌసల్యానందవర్ధనః, రాజపుత్రః అని ఇలాంటి మాటలతోనే వర్ణిస్తూ పోతాడు. ఏ మిత్రుడుగాని, బంధువుగాని, మహర్షిగాని, తుదకు గుహశబర్యాది భక్తులుగాని భగవన్నని ఆయన నెక్కడా సంబోధించినట్టు నిదర్శన కనిపించదు. భగవంతుడి అవతారమేనని రూఢి అయినప్పుడు భగవంతుడని సంబోధిస్తే తప్పేముంది. మరచికూడా అలాంటి మాట ప్రయోగించడు వాల్మీకి. మరి కృష్ణుడి విషయమలా కాదు. ఎక్కడ చూచినా భగవాన్ భగవాన్ అనే మాట మారుమ్రోగుతూ పోతుంది సాహిత్య ప్రపంచంలో. అసలు భగవద్గీత భాగవతమని గ్రంథాలకు చేసిన నామకరణమే చాలు ఈ సత్యాన్ని మనకు చాటటానికి. దీనిని బట్టి చూచినా చెప్పవచ్చు రాముడి భగవత్తత్త్వ విషయం సందిగ్ధమేనని.
ఏతావతా తేలిందేమిటి. కృష్ణుడిలాగా రాముడు భగవదవతారం కాదేమోనని గదా. అలా అనుకోవటానికి పైన చూపినట్టుగాఎన్నో కారణాలున్నట్టుగా కూడా కనిపిస్తుంది మనకు. కాని అవన్నీ కారణా భాసలేగాని మరేమీ గాదు. కృష్ణుడిలాగా ఆయన భగవంతుడు కాడనుకోవటం, కేవలం మానవుడేనని భావించటం, ఇదంతా మన భ్రాంతేగాని, వేరుగాదు. కృష్ణుడూ భగవంతుడే రాముడూ భగవంతుడే. ఒకరు మాత్రమే అయి మరొకరు కాకపోలేదు. ఇంతకుముందు చెప్పినట్లు ఇద్దరూ దుష్టశిక్షణ కోసమవతరించినప్పుడు తద్వారా ధర్మసంస్థాపనం చేసినప్పుడు ఇలాంటి సందేహాని కాస్పదమేముంది. పైగా జయవిజయుల శాపవృత్తాంతమొకటి ప్రమాణముండగా
Page 124