కుపదేశం చేయలేదు. మీదు మిక్కిలి వసిష్ఠ విశ్వామిత్రాగస్త్యాదు లందరికీ శుశ్రూషచేసి వారివల్ల అన్నివిద్యలూ అభ్యసించవలసి వచ్చింది. కృష్ణుడలా కాదు. గర్గసాందీపనాదు లాచార్యులని ఒక లాంఛనమే గాని వారితో సహా అందరికీ తానే ఆచార్యకం వహించాడు. కష్టసమయాలలో వారి నాదుకొన్నాడు. అద్భుతమైన లీలలు ప్రదర్శించి వారికుపదేశంతోపాటు ఉపకారం కూడా చేశాడు. ఇంతెందుకు. అసలు ప్రతి ఒక్కటీ ముందుగానే తెలిసి చేసినట్టు కనిపిస్తుంది కృష్ణావతారంలో. రామావతారంలో ఏ ఉపద్రవమెప్పుడు వచ్చిపడితే అప్పుడది అనుభవించినట్టే తోస్తుంది మనకు. చివరకంతమంది కాంతలతో సతమతమై కూడా కృష్ణుడు వారి నవలీలగా వదులుకోగలిగితే రాముడు ఒకేఒక కాంతనొక సంవత్సరకాల మెడబాసి బ్రతకటానికి బెంబేలు పడతాడు.
ఇలా జీవిత విధానమేగాదు. వేషభాషలు చూచినా ఇద్దరికీ ఎంతో అంతరం కనిపిస్తుందని చెప్పాము. కృష్ణుడి రూపంలో కనిపించినట్టు రాముడిలో మూల విరాట్టయిన విష్ణువురూపం కనిపించదు. కృష్ణుడు చతుర్బాహువైతే రాముడు మనలాగా కేవలం ద్విబాహువే. ఆయన పీతాంబరమూ, వనమాలా, కౌస్తుభమూ ఇలాంటి విష్ణుచిహ్నాలన్నీ ధరించి తిరిగితే ఈయన కేవలం ధనుర్బాణాదులు ధరించి ఓ తపస్వి వేషంలో కనిపిస్తాడు. ఒకేసారి అనేక రూపాలు ధరించగలడు కృష్ణుడు, రాముడు జీవితాంతమూ ఒకేరూపంలో తప్ప ఇన్ని రూపాలలో ఎప్పుడూ కనిపించలేదు. మరి నాలుగు మార్లు చూపాడు విశ్వరూపాన్ని కృష్ణుడు తన జీవితంలో. అలాంటి ఘట్టం ఒక్క మారుకూడా చూడబోము రాముడి జీవితంలో. ఇక గోవర్ధనోద్ధరణం దగ్గరినుంచీ, కాళీయ మర్ధనం దగ్గరినుంచీ, చివరిదాకా కృష్ణుడు చేసినచూపిన అతి మానుషమైన చర్యలూ, లీలలూ ఇన్నీ అన్నీ కావు. ఎప్పటికప్పుడు బంధు మిత్ర శత్రు భక్త జనావళినంతా ఆశ్చర్య రసార్ణవంలో ముంచి తేలుస్తూ ఆయన గారి అవతార తత్త్వాన్ని చెప్పకుండానే చెబుతూ వచ్చింది. ఇలాంటి అద్భుత చర్యలలో ఒక్కటి కూడా మనకు దాఖలా అయిన జాడా గోచరం కాదు రామావతారంలో. మొదటి నుంచీ చివరిదాకా అంతా మానవోచితమైన వ్యవహారమే. మాటలే. సుఖదుఃఖాద్యనుభవమే. సామాన్య మానవుడికంటే ఇంకా తక్కువ స్థాయిలో వ్యవహరించినట్టుగా కూడా కనిపిస్తుందక్కడక్కడా, కడకు అక్ష్మణుడు, సుగ్రీవుడు
Page 123