రామ యాథాత్మ్యము
మనమింతవరకూ రామాయణకథా తాత్పర్యమూ, కథా నేపధ్యమూ, ఆయా ఉపాఖ్యానాలూ, వర్ణనలూ, ఇలాంటి విషయాలనే విపులంగా చర్చించాము. చూడబోతే వీటిలో ప్రతి ఒకటీ కూడా రామాయణమనే పేరు సార్ధకం చేస్తున్నదే. ఏమిటి రామాయణమంటే. రాముడే గమ్యమూ, రాముడే గమకమూ నని గదా వర్ణించాము. ప్రతి ఒక్క అంశమూ రామాయణంలో రామాభిముఖంగా ప్రయాణిస్తున్నది. అది ప్రధాన కథగానీ, ప్రాసంగిక కథలుగానీ, ప్రకృతి వర్ణనలుగానీ, ఆయా పాత్రల ప్రవృత్తులుగానీ, అన్నీ రామాశ్రయమే. రామైక పరాయణమే. అది సాక్షాత్తుగా కావచ్చు. పరంపరయాకావచ్చు. మొత్తం మీద ఏది ఎక్కడ ఎలా ప్రస్తావించినా అది ఒక వాగులాగానో వంకలాగానో ఏఱులాగానో సెలయేఱులాగానో బయలుదేరి అటూ ఇటూ ఎన్ని మెలికలు తిరిగినా తిరగకున్నా కడపటపోయి కలవవలసిందా కడలిలోనే. అది తరువాత తరువాత ఇంకా విశదమవుతూ వస్తుంది. పోతే కథా ప్రాసంగిక వర్ణనాదులన్నీ ఇలా ఏకైక పాత్ర ప్రభావపర్యవవసాయులంటే ఆ పాత్ర సామాన్యమైనది కాదు. కాదని ఆరంభంలోనే సూచన చేశాను. రాముడంటే ఎవడు. దశరథ రాముడా, ఆత్మారాముడా, అని ప్రశ్న వేసుకొని ఆత్మారాముడే దశరథ రాముడుగా నటిస్తూ వచ్చాడని అది కేవలం నటనమేగాని మరేదీగాదని పేర్కొన్నాము. అదే ఇప్పుడు మనం విపులంగా చర్చించవలసి ఉంది.
రామాయణ కథానాయకుడైన రాముడెవరు. ఉత్తమ పురుషుడా లేక పురుషోత్తముడా ? ఉత్తమ పురుషుడంటే పరమాత్మ. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః అని భగవద్గీతా వాక్యం, అలా కాక పురుషోత్తముడనుకొన్నామో, మానవులలోనే ఒకానొక ఉత్తముడైన మానవుడు. అందరికీ ఆదర్శప్రాయమైన వాడని అర్ధం. మొదటి పక్షంలో సాక్షాత్తూ భగవంతుడే అవుతాడు రాముడు. రెండవ పక్షంలో సర్వశ్రేష్ఠుడైన మానవుడవుతాడు. ఇందులో ఎవడీ రాముడు. ఎవడనే ప్రశ్న అసలెందుకు వచ్చింది. దశావతారాలలో రాముడుకూడా ఒక అవతార విశేషమే నని గదా పరిగణించారు పురాణాలలో. అలాంటప్పుడు మిగతా అవతారాలలాగా
Page 119