ఇదీ భగవంతుడే కావాలి గదా. వాటిలో దేనిలోనూ కలగని విచికిత్స ఇందులో మాత్రమే ఎందుకేర్పడింది. నిజమే. అలా ఏర్పడటానికి వీలులేదు. విభవావతారాలలో కృష్ణావతారమెంతో రామావతారమూ అలాంటిదే. పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతా మన్నట్టు దుష్టశిక్షణ శిష్టరక్షణా చేసి విశ్వధర్మాన్ని స్థాపించటానికే గదా భగవంతుడు లోకంలో అవతరిస్తాడని చాటుతున్నది శాస్త్రం. అది కృష్ణుడూ చేశాడు. రాముడూ చేశాడు. ఇరువురూ దుష్టులైన రాక్షసులను సంహరించి శిష్టులైన ధర్మజ విభీషణాదులను కాపాడారు.
అంతేకాదు. అసలు జయ విజయులవృత్తాంతమొక్కటి మనసుకు తెచ్చుకుంటే చాలు. విమర్శకులు చేసే అభియోగం ఎంత మాత్రమూ అర్థం లేనిదని తెలిసి పోతుంది. జయవిజయులు వైకుంఠ ద్వారపాలకులు. వారిని సనక సనందనాదులు శపించారు భూలోకంలో పోయి పుట్టండని వారు దానికి వగుస్తుంటే స్వామివారనుగ్రహిస్తారు వారిని. మూడు జన్మలలో నాతో విరోధం సాధించి వస్తారా లేక బహుజన్మలలో విహితంగా వస్తారా చెప్పండని. విరోధమైతే అయింది మూడు జన్మలలోనే ముగించుకొని వస్తామని సమాధానమిస్తారు వారు. అలా వచ్చి జన్మించినవారే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులూ, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులూ, ద్వాపరంలో శిశుపాల దంతవక్త్రులూ, వారిని సంహరించటానికి ఆ శ్రీ మహావిష్ణువే అవతరించాడు. కృతంలో వరాహ నృసింహావతారాలెత్తి హిరణ్యుల నంతమొందించాడు. ద్వాపరంలో కృష్ణావతారమెత్తి శిశుపాల దంతవక్త్రులను రూపుమాపాడు. మరి త్రేతాయుగంలో రావణకుంభకర్ణులను కూడా ఆ దేవుడే గదా సంహరించవలసింది. అలాంటప్పుడు రాముడా విష్ణుదేవుని అవతారంగాక మరెవరవుతాడు. ఆ మూడూ అవతారాలయి ఇది ఒక్కటీ కాకపోతుందా ? అలా చెప్పటం ఏమి బాగు ఏమి సబబు. పురాణ ప్రక్రియకే అది విరుద్ధం గదా.
అంతేకాదు. రాముడవతార పురుషుడు కాడంటే అది పురాణాలకేగాక రామాయణానికికూడా విరుద్ధమే. వేదవతిని విష్ణువుకే ఇచ్చి పెండ్లి చేయాలనుకొన్నాడు తండ్రి. ఆయన సంకల్పం నెఱవేఱకుండానే మరణించాడు హఠాత్తుగా. తండ్రి సంకల్పం ఎలాగైనా సాధించాలని తపస్సు చేస్తుంది వేదవతి. మధ్యలో రావణుడు బలాత్కరించబోతే సహించలేక మరుజన్మలో సీతగా జన్మించి ఆ విష్ణువునే వివాహం
Page 120