గ్రంథమవుతుంది. ఒక్క అధ్యాయంలో అన్నింటినీ కుదించి వ్రాయటం కొండనద్దంలో చూపినట్టే. మొత్తాని కొక్క సత్యం గ్రహిస్తే చాలు మనం. వాల్మీకి తన ఇతిహాసంలో కథావస్తువు నెంత ప్రపంచించాడో వర్ణనలు కూడా అంత నిబంధించాడు. అవి చేతనాచేతనాలకు రెంటికీ చెందిన వర్ణనలు. రెండు తీరాలను ఒరుసుకొని పారే మహానది ఆయన వర్ణానా శిల్పం. అచేతనాలలో కూడా చేతన వ్యవహారం కనిపించే ప్రౌఢమైన శిల్పమది. ఎంత సహజమో అంత సుందరం. ఎంత సుందరమో అంత ఉదాత్తం. ఎంత ఉదాత్తమో అంత హృదయంగమం. ఎంత హృదయంగమమో అంత అనుసంధానాత్మకం. ఎంత అనుసంధానాత్మకమో అంత అవిస్మరణీయం. ఆనందదాయకం. వర్ణన వర్ణనకోసమే చేసిందికాదు. సౌందర్యంతోపాటు సార్థక్యమూ, కథా సామరస్యమూ కూడా సాధించాడు మహాకవి. ముందు చెప్పినట్టు ఇది కథ ఇది వర్ణన అని విడివిడి భాగాలుగా కాక రెండూ కలిపి అవిభాగంగా ఒక గంగానదిలాగా ప్రవహిస్తుంది చివరదాకా. ఇదే ఏకవాక్యత కావ్యంలో, బాహ్యప్రకృతి వర్ణన అంతా కథకు నేపథ్యాన్ని సవరిస్తే అది ఆయాపాత్రల భావాలకూ, ప్రవృత్తులకూ అద్దం పడితే అవన్నీ రసభావాలను చిలకరిస్తే ఆ చిలికిన ప్రతిబిందువూ ఒకదానికొకటి చేరి చివరకు రామాభిముఖంగా ప్రసరిస్తూ రామాయణమనే పేరు సార్ధకం చేస్తున్నాయి. అంతా రామమయమే. ఆ సూత్రంలో పొదిగిన పూసలే కథా సన్నివేశాలూ, వర్ణనలూ, వివిధ పాత్రలూ, వారి రసభావాలూ, సర్వమూ.
Page 118