#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  అంచేత సుఖినః క్షత్రియా లభంతే యుద్ధ మీదృశం. అయ్యో అనవసరంగా ఈ యుద్ధం వచ్చి నెత్తిన బడ్డదే. చేయక తప్పటం లేదే చేస్తే ఇంతమంది మూకుమ్మడిగా నా చేతిలో మరణిస్తారే అని దిగులు పడనక్కరలేదు. ఇలాంటి యుద్ధం చేస్తున్నావంటే ఎంతో అదృష్టమనుకో. ఎంతో సుఖానికి నోచుకొన్న క్షత్రియులకే ఇలాటి భాగ్యం పడుతుందని భావించు. నీధర్మం నీవు చేస్తున్నావు. దానివల్ల హాని లేకపోగా తరువాత దాని ఫలితంగా స్వర్గ సుఖాన్నే చూరగొంటున్నావు. అలాంటప్పుడు తప్పు చేస్తున్నాననే సంకోచం దేనికి నీకు.

  ఇక్కడ శ్రేయస్సనే మాట గుర్తుంచుకోండి. ఇది మనకు పరమాత్మ ఎంత చేయమని సిఫారసు చేస్తున్నా శ్రేయస్సేగాని నిః శ్రేయసం కాదు. శ్రేయస్సంటే అభ్యుదయం. Prosperity నిశ్రేయసమంటే అభ్యుదయమే గాదు. మోక్షం. ధర్మ మభ్యుదయాన్ని మాత్రమే ఇస్తుంది. మోక్షాన్ని ప్రసాదించలేదు. ఆత్మజ్ఞానం లేకుండా కలగదది. అది లేకున్నా కేవలం ధర్మాన్ని పాటిస్తే కలుగుతుంది శ్రేయస్సు. అదే స్వర్గలోక ప్రాప్తి. కలుగుతుందనే గాని ఎంతో కాల మనుభవించ లేడా సుఖం. అనుభవం తీరిపోగానే మరలా వచ్చి పడవలసి వస్తుందీ కర్మ భూమిలో.

  కనుక స్వధర్మ మపిచా వేక్ష్య అనే శ్లోకం దగ్గరి నుంచీ సుఖదుఃఖే సమేకృత్వా అని రాబోయే శ్లోకం వరకూ ఈ ఎనిమిది శ్లోకాలూ మనకు ధర్మ పురుషార్ధాన్నే బోధిస్తాయి గాని మోక్ష పురుషార్ధాన్ని కాదు.

Page 117

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు