#


Index

వర్ణనా సామరస్యము

  ఋతువర్ణన లాకర్ణించారుగా. ఇక చంద్రోదయ వర్ణన ఒకటి ఉదాహరిస్తాను చూడండి. ఎంత రమణీయంగా సాగిందో. ఇది సుందరకాండం ఆరంభంలో వస్తుంది. అయిదవ సర్గ అంతా చంద్రవర్ణనే. సరిగా రాత్రికాలంలో ప్రవేశించాడు హనుమంతుడు లంకలో. అదికూడా శరద్రాత్రి. పున్నమ వెన్నెల పిండి ఆరబోసినట్టు వెండిరేకులు విప్పినట్లు నలుదిక్కులా పిక్కటిల్లి కాస్తున్నది. తతస్సమధ్యం గతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతమ్. ఆకాశమధ్యాని కెగబ్రాకాడు చంద్రుడు. చంద్రికా పూరాన్ని ఒలకబోస్తున్నాడు. ఒంటరిగా వినువీధిలో తిరుగుతుంటే మదించిన ఆబోతొకటి తిరుగుతున్నట్టుందట అంతేకాదు. హంసో యథా రాజపంజరస్థ – స్సింహో యథామందర కందరస్థః వీరాయథా గర్వితకుంజరస్థ శ్చంద్రో విబభ్రాజత ధాంబరస్థః వెండి పంజరంలో పెట్టిన ఒక హంసలాగా మందరపర్వత కందరంలో కూచున్న ఒక సింహంలాగా పెద్ద మదుపుటేనుగు నెక్కి కూచున్న ఒక వీరభటుడిలాగా ప్రకాశిస్తున్నాడట ఆకాశస్థితుడైన ఆ చంద్రుడు. ఏమి విలక్షణమైన ఊహ ఇది. శిలాతలం ప్రాప్య యధా మృగేంద్రోమహారణం ప్రాప్యయథా గజేంద్రః రాజ్యం సమాసాద్యయథా నరేంద్రః తథా ప్రకాశోవిరరాజ చంద్రః అవే భావాలు మరోరీతిలో చెబితే కూడా చూడండి ఎంత మనోజ్ఞంగా ఉన్నవో. ఇలా నడుస్తుందీ చంద్రోదయ వర్ణన. ఇదేదో మిగతా కావ్యాలలో మాదిరి పనిలేక చేసిన వర్ణన గాదు. రాత్రికాలమది. హనుమంతుడు పరాయి పట్టణంలో ప్రవేశించాడు. సీతాన్వేషణ చేయవలసి ఉంది. చీకట్లో కన్నా వెలుగులో అయితే అనుకూలం. ఆ వెలుగును సరఫరా చేస్తున్నాడు చంద్రుడు. శరత్కాల రాత్రి కాబట్టి అది ఎలాగని ప్రశ్న తల ఎత్తదు. పైగా మరొక రహస్యమేమంటే రామకార్యమది. రామకార్యం సమస్త దేవతల కార్యం. చంద్రుడు ఒక దేవతే. కనుక రామదూత కాతడూ తోడుపడటం సముచితం. అలా తోడ్పడ్డాడనే కంఠోక్తిగా పేర్కొంటాడు కవి. సీతాదర్శనార్థం ఆంజనేయుడశోక వనంలో ప్రయత్నిస్తుండగా ప్రజగామన భశ్చంద్రో - హంసోనీలమివోదకమ్ - నల్లని సరోవర జలంలో తెల్లని హంస ప్రవేశించినట్టు విశాల వినీలాకాశంలోకి తూర్పు దిక్కునుంచి చంద్రబింబం ప్రవేశిస్తున్నదట. సాచివ్య మివకుర్వన్స - ప్రభయానిర్మలప్రభ శ్చంద్రమారశ్మిభిశ్శీతై స్సిషేవే పవనాత్మజమ్ రామకార్య సాధనలో తానుకూడా తోడ్పడాలనే సత్సంకల్పంతో

Page 111

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు