ప్రణష్టాః లోకంతోపాటు తనకూ సంతోషమీయవచ్చు. తటాకాల మాదిరే తన మనోరథాలునిండించవచ్చు. వసుంధరనులాగే తన బ్రతుకునూ పండించవచ్చు ననుకొన్నాడా మేఘమిత్రులను చూచి ఆ మిత్రకులుడు. వచ్చిందిక దాని వారసుడు శరత్తు. నాలుగు వర్షర్తు మాసాలూ వర్షశతంగా గడిపిన రాముడి కళ్లకొక్కసారి శరలక్ష్మి సౌందర్యాన్నిచూస్తే తన సీతాలక్ష్మి సుందరమూర్తే సాక్షాత్కరించింది. రాత్రి శ్శశాంకోదిత సౌమ్యవక్తా - తారాగణోన్మీలిత చారునేత్రా - జ్యోత్స్నాంశుక ప్రావరణా విభాతి నారీవ శుక్లాంశుక సంవృతాంగీ శరద్రాత్రి చంద్రుడనే అందమైన ముఖం పైకెత్తింది. మినమినలాడే నక్షత్రాలనే నేత్రాలు మెల్లగా తెరిచింది. తెల్లని స్వచ్ఛమైన వెన్నెల చీర ధరించింది. చంద్రుణ్ణి సమీపించింది. కాదు రామచంద్రుణ్ణి. చంచచ్చంద్రకర స్పర్శ - హరోన్మీలితతారకా - అహోరాగవతీ సంధ్యా జహాతిస్వయమంబరమ్ ఆ చంద్రుడి కరస్పర్శకు శరీరం పులకించి నేత్ర తారకలు వికసించి సంధ్యాదేవి స్వయంగానే అంబరం వదిలేసి వెళ్లుతుంది. ఆ వెళ్లటం చూచాడు రాముడు. అది తన గతానుభవాలు స్మరణకు తెచ్చి ఉంటాయి. వెంటనే పైకి చూచే తన దృష్టిని నేలమీదికి మళ్లించాడు. అక్కడా అలాంటి దృశ్యమే ఒకటి కంటబడింది. ఏమిటది. దర్శయంతి శరన్నద్యః పులినానిశనైః శనైః నవసంగమ సవ్రీడా - జఘనానీవ యోషితః శరన్నదీ కన్యకలు పులినాలనే జఘనాలను కప్పిన జలాంశుకా లంతకంతకు జారుతూ పోయేసరికి విశాలమైనా జఘనాలు బయటపడుతున్నాయి. అవి చూస్తే నవసంగమ సమయంలో పూర్వం తన కాంత పిఱుదుల మీద వస్త్రాన్ని తాను తొలగిస్తే అంతకంత కావిడ పిఱుదులు బయటపడితే ఆవిడ సిగ్గుతో కుంచుకుపోయే రమణీయ దృశ్యం కళ్లపండువుగా కనిపించింది. రాముడికి కనిపించటం మాట అలా ఉంచి మన భావుకుల మనోనేత్రాలకు చూపుతున్నాడొక ఐంద్రజాలికుడిలాగా వాల్మీకి మహాకవి ఎన్నెన్నో ప్రకృతి వర్ణచిత్రాలను శృంగార వర్ణచిత్రాలలో ఇలాంటి అపూర్వమైన భావచిత్రాలు సాహిత్యంలో మరెక్కడా దొరకవు మనకు. ఎంత వెలపెట్టినా లభించవు. ఇందులోనూ రాముడి కాముకత్వం ఎంతగానో కనిపిస్తుంది. అయితే ఒక అవతార పురుషుడైన వాడిలా ఒక బేలలాగా విలపించటమేమిటి కవి దానినింతగా చిలవలు పలవలు పెట్టి వర్ణించటమేమిటి. చెప్పానుగా దీనికి సమాధానం తరువాత వస్తుందని. అంతదాకా జిజ్ఞాసువులు కొంచెమోపిక పట్టుదురుగాక.
Page 110