అక్కరలేదు. దేవేంద్రుడి అమరావతీ అక్కరలేదాయనకు. ఇలా ఎంతగానో సాగింది వసంత వైభవ వర్ణన ఈ ఘట్టంలో. ఏమిటిదంతా. రాముడంతటి అవతార పురుషుడింత బేలగా వాపోవటమా, పైగా తమ్ముడి ఎదుట. ఏమౌచిత్యమిది. నిజమే. దీనికి సంజాయిషీ దీని తరువాత అధ్యాయంలో మనవి చేస్తాను.
పోతే కిష్కింధా మధ్యంలో మరి రెండు ఋతువుల వర్ణన వస్తుంది. అతిలోకమా వర్ణన. ఒకటి వర్షర్తువు. మరొకటి శరదృతువు. ఏమి వర్ణించాడు మహానుభావుడా రెండింటినీ. కథా గమనానికే మాత్రమూ అడ్డురాని వర్ణనలు. రాముడు వాలిని సంహరించాడు. సుగ్రీవుణ్ణి అభిషేకించాడు. ఇక జరగవలసిందేమిటి. రాముడు చేసిన ఉపకారాని కతడు ప్రత్యుపకారం చేయాలి. ఏమిటది. ఆయన తన శత్రువును సంహరించి తనకు భార్యా సమాగమం కలిగించినట్టే తానూ అతని శత్రువైన రావణుణ్ణి వధించటానికి తోడ్పడి సీతతో ఆయనకు సమాగమం కలిగించాలి. అలా జరగాలంటే వానర సైన్యంతో లంకకు తరలిపోవాలి. కాని యుద్ధయాత్ర ఎప్పుడంటే అప్పుడు చేసేది గాదు. అది వర్షర్తువులో పనికిరాదు. శరదృతువు రావాలి. అందుచేత కథలో ఒక విరామ మేర్పడింది. అది ఒక మంచి అవకాశమిచ్చింది వర్ణనకు. అందులోనూ ముందు వర్షర్తువు తరువాత శరదృతువు. వర్షర్తువంతా రామలక్ష్మణులు ఋశ్యమూకం మీదనే ఒంటరిగా కాలక్షేపం చేస్తుంటారు. సుగ్రీవుడాహ్వానించినా గుహలో ప్రవేశించలేదు. అసలే ప్రియా విరహితుడు. అందులో వర్షాకాలము, దానికి తోడు సహజంగా కామోన్మత్తుడు రాముడు. ఇక ఆయన అవస్థ ఎలా ఉంటుందో చెప్పాలా. బాహ్యప్రకృతి నొకప్రక్క వర్ణిస్తూనే తద్ద్వారా రాముడి అంతః ప్రకృతినెలా ద్యోతనం చేశాడో వాల్మీకి అది అతిలోకం. మందమారుత నిః శ్వాసం సంధ్యాచందనరంజితం ఆపాండు జలదంభాతి కామాతురమివాంబరమ్ -మందమారుతం నిశ్శ్వాసమైతే సంధ్యారాగం చందనమైతే తెల్లని మేఘశకలాలు పాలిపోయిన శరీరమైతే అలాంటి ఆకాశం పరిస్థితి చూస్తే కామాతురుడైన తన రూపమే కనిపిస్తున్నదాయనకు. మేఘోదరవినిర్ముక్తాః కల్హారసుఖశీతలాః శక్యమంజలిభిః పాతుం-వాతాః కేతకిగంధినః మేఘాల లోపలినుంచి దూసుకొని వచ్చి కల్హారసుఖ శీతలంగా వీస్తూ మొగలి పుప్పాళ్లు చేరి బాగా చిక్కబడిన పిల్లగాలులను చక్కగా దోసిళ్లలో పోసుకొని పాయసంలాగా జుఱుకోవచ్చునట.
Page 108