శబరీ సమాగమమయి వస్తూ దారిలో పంపా సరస్సునూ ఆ పరిసరాలనూ చూచాడో లేదో. ఇక రేకెత్తింది ఆయనగారి కెక్కడలేని మదనోన్మాదమూ మనం చెప్పటంకాదు. కవే అంటాడు కంఠోక్తిగా మదనాభిపీడితః అని. అసలావిడ దగ్గర లేకుంటే జీవించటమెలాగని వాపోతాడు. పంపాపుష్కరిణిని చూడగానే అసలు హర్షాదింద్రియాణి చకంపిరే. సకామవశమాపన్నః పంచేంద్రియాలు చలించిపోతాయి. మనసు కామానికి వశమై పోతుంది. దానితో ప్రకృతి సౌందర్యమంతా ఒక్కచోట రాశీభూతమైనట్టు కనిపిస్తుందా ప్రాంతమంతా రాముడికి. కామీ స్వతామ్ పశ్యతి అనే సూక్తి అడుగడుగునా తార్కాణ అవుతుంది. అధికం ప్రతిభాత్యేతన్నీలపీతం తు శాద్వలం ద్రుమాణాం వివిధైః పుష్పైః పరిస్తోమై రి వార్పితం నీలపీతమైన పచ్చిక బయలుమీద రకరకాల పువ్వులు రాలిపడితే రంగురంగులపచ్చని తివాచీ పరచి నట్టుందట. సీతతో పాటు ఎన్నోమార్లు కూచొని ఉంటాడలాంటి చోట. అందుకే జ్ఞాపకం వచ్చింది. అంతేకాదు. "పుష్పభార సమృద్ధాని శిఖరాణిసమంతతః లతాభిః పుష్పితాగ్రాభిః ఉపగూఢాని సర్వతః" పుష్పాలతో నిండి ఉన్న తరుశిఖరాలను లతలు పెనవేసుకొన ఉన్నాయట. లతలుకాదు. లతాంగి సీతయే తన్ను తన సుకుమార బాహువులతో పెనవేసుకోవటం మనసుకు వచ్చి ఉంటుంది. ఈ వర్ణన చూడండి ఎంత మనోహరమో. పతితైః పతమానైశ్చ - పాదపస్థైశ్చ మారుతః కుసుమైః పశ్య సౌమిత్రే - క్రీడన్నివ సమంతతః గాలికి చెట్లనుంచి కొన్ని పూలు రాలిపోయాయి. కొన్ని రాలుతున్నాయి. కొన్ని రాలటానికి సిద్ధంగా చెట్లనే ఇంకా అంటుకొని ఉన్నాయట. చూస్తే మారుతమా పూలతో ఆడుకొన్నట్టుందట. మారుతమేమోగాని సీతతో తాను ఆడుకొన్న పూబంతులాట తలపోస్తుండవచ్చు. ఆయంహిదయిత స్తస్యాః కాలః ఆవిడ కిది చాలా ఇష్టమైన మాసం. వసంతో యదితత్రాపి - యత్రమేవసతి ప్రియా-నూనమ్ పరవశాసీతా సాపిశోచత్యహంయథా ఈ వసంతం అక్కడా ఉంటే నాలాగే ఆవిడా ఎంత బాధపడుతుందో గదా అని పలవిస్తాడు. అప్పటికి తనకూ ఇష్టమే వసంతమంటే ఎటువచ్చీ ఆవిడ దగ్గర లేనందువల్లనే తన కది బాధాకర మయింది. యానిస్మరమణీయాని తయాసహభవంతి మే తాన్యేవారమణీయాని జాయంతే మే తయావినా అంతకుముందు ఎంతో అందంగా కనిపించేవన్నీ ఇప్పుడసహ్యంగా తోస్తున్నాయి. పరితాపాన్ని కూడా కలిగిస్తున్నాయి.
Page 106