#


Index

వర్ణనా సామరస్యము

ఖాయమైందని విని సహించలేక వెనక్కు తగ్గాడు. అవశ్యాయతమోనద్ధా నీహారతమసావృతాః ప్రసుప్తాఇవలక్ష్యంతే విపుష్పావనరాజయః మంచు కప్పిన వనవృక్షాలు పూలన్నీ నేలరాలి నిద్రపోతున్నట్టు కనిపిస్తున్నాయట. నిద్ర పోతున్నది వనంలో వృక్షాలు కావు. పట్టణంలో ప్రజలు. రామవియోగానల దగ్ధులై శోకధూమం మంచులాగా ముఖాలు కప్పితే వేషభాషలు వదలివేసి ఎక్కడి వారక్కడ కూలబడి ఉన్న అయోధ్యవాసులే వారు. ఇక సాక్షాత్తుగా భరతుడి దశే వర్ణిస్తున్నాడు లక్ష్మణుడు. అస్మింస్తుపురుషవ్యాఘ్రః కాలేదుఃఖ సమన్వితః తపశ్చరతి ధర్మాత్మా త్వద్భక్త్యాభరతః పురే త్యక్త్వారాజ్యంచ భోగాంశ్చశీతే శేతేమహీతలే సోపివేలామిమాంనూన మభిషేకార్థముద్యతః వృతః ప్రకృతిభిర్నిత్యమ్ ప్రయాతిసరయూం నదీమ్. అత్యంత సుఖ సంవృద్ధః సుకుమారః కథం న్వపరరాత్రేషు సరయూ మవగాహతే నీవు వనంలో అయితే అతడు పురంలోనే తపస్సు చేస్తున్నాడు. రాజ్యం భోగం అంతా వదిలేసి నీ మీది భక్తితో కేవలం భూతల శయనం చేస్తున్నాడీ శీతలమైన ఋతువులోకూడా. అంత సుకుమారుడూ సుభోచితుడూ ఈ చలిలో ఇంత అపర రాత్రులలో సరయూ నదికి పోయి ఎలా స్నానాలు చేస్తున్నాడో గదా అని వాపోతాడు. ఇది భరతుణ్ణి తలచుకొని వాపోయే నెపంతో రాముణ్ణి చూచి వాపోవటమే. మరి ఈ వ్యథకంతా మూలకారణం కైక గదా అని ఆవిడ కథ జ్ఞాపకం వచ్చి ఆవిడను నిందిస్తాడు లక్ష్మణుడు. అది తప్పని మందలిస్తాడు రాముడు. ఇలా కథతో ఎంతగానో పెనవేసుకొని సాగింది హేమంతవర్ణన.

  ఇంతకన్నా కిష్కింధాదిలో చేసిన వసంత వర్ణన ఇంకా రసిక జన మనోభిరామ మయింది. ఇది భరతుడి క్లేశాన్ని మనసుకు తెస్తే అది రాముడి పరితాపాన్నే పదింతలుగా అనుభూతికి తెస్తుంది. సీతా వియోగానంతరం ఇంకా కిష్కింధకు రాక పూర్వం తమ్ముడితో గలిసి అడవిలో ఆ చెట్టూ ఈ పుట్టా కుమ్మరుతూ రాముడు తన మనసులోని ఉమ్మలికాన్ని ఎంతగానో వెళ్లగక్కుతాడు. అమాయికుడైన ఒక బాలకుడిలాగా తమ్ముణ్ణి కరుచుకొని పరిపరివిధాల ఆయన చేసిన ఆక్రందనం కాముక నాయక వర్ణనా కీర్ణ కావ్య ప్రపంచంలో నభూతో నభవిష్యతి. కాళిదాసు లేదు. భవభూతి లేదు. మహామహా కొమ్ములు దిరిగిన మహాకవులంతా ఆయన దగ్గర బచ్చాలే. వాచంయముడైన మహర్షి కలంనుంచి అలాంటి విప్రలంభ శృంగార రసస్రవంతి జాలువారటం ఎంతైనా ఆశ్చర్యకరం. ఆనందదాయకం.

Page 105

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు