ప్రేయసీ ప్రియులకది హర్షదాయకం. ప్రస్తుతం రాముడు భార్యాసమేతుడయి ఉన్నాడు. లక్ష్మణుడే ఎటువచ్చీ భార్యావిదూరుడు. కనుకనే అన్నగారిని సంబోధించి అలా మాట్లాడుతున్నాడు. అంతేకాదు. హేమంతం మార్గశిరంతో మొదలవుతుంది. మాసానాం మార్గశీర్షిహమన్నాడు పరమాత్మ. మాసాలలో ఆయన మార్గశీర్ష స్వరూపుడట. మరి రాముడా పరమాత్మే గదా. అతనికామాసం ఇష్టమని వర్ణించే లక్ష్మణుడి మాటల్లో ఎంత నిగూఢంగా రాముడి పరమాత్మ భావం లోకానికి సూచితమవుతూ ఉందో.
ఇక ఆ ఋతువెలాంటిదో వర్ణిస్తున్నాడు లక్ష్మణుడు. నీహారపరుషోలోకః పృథివీసస్యశాలినీ జలాన్యనుపభోగ్యాని, సుభగోహవ్యవాహనః మంచు తెరలు కప్పి లోకం కనపడుటలేదు. అయినా ఫరవాలేదు. నేల అంతా పచ్చని తివాచీ పరచినట్టు సస్యశ్యామలంగా ఉంది. నీళ్లలో చేయి పెట్టలేము. మంచుగడ్డలా ఉన్నాయి. అయినా పరవాలేదు. అగ్నిహోత్రుని దగ్గర కూచుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఒకటి ప్రతికూలమైతే మరొకటి అనుకూలమైన కాలమిది. ఇది ప్రస్తుతం రామాదులున్న దశను భంగ్యంతరంగా చాటుతున్నది. అయోధ్యా నివాసానికి నోచుకోలేదు వారు. కాని అరణ్యంలో అంతకన్నా స్వేచ్చగా బ్రతుకుతున్నారు. సేవమానే దృఢం సూర్యే దిశమంతకసేవితామ్ - విహీన తిలకేవస్త్రీ -నోత్తరా దిక్రకాశతే ఈ భావం చూడండి. ఇంకా ఎంత గొప్పదో. సూర్యుడు దక్షిణంవైపు పయనిస్తుంటే ఉత్తరదిశ తిలకంలేని స్త్రీముఖంలాగా కళావిహీనంగా కనిపిస్తున్నదట. సూర్యుడనే మాట సూర్యవంశీయులన్న భావంకూడా సూచిస్తుంది. రాముడే సూర్యుడిక్కడ. ఆయనగారు ఉత్తరాన ఉన్న అయోధ్యను వదిలేసి ప్రస్తుతం దక్షిణంవైపు బయలుదేరి వచ్చాడు. గుణాభిరాముడైన రాముడు లేని అయోధ్య మరి కళావిహీనకాక ఏమవుతుంది. మరి ఒక గూఢమైన భావముందిక్కడ. అంతక సేవిత అయిన దక్షిణదిశ అనటంలో సూర్యుడక్కడికెళ్లాడనటంలో దశరథుడు రామవియోగాన్ని భరించలేక యమసదనం చేరుతాడని తన్నిమిత్తంగా కౌసల్యాదులైన రాణులు తమ సౌభాగ్యాన్ని కోలుపోతారని వారితోపాటు సాకేత నగరంకూడా ప్రకాశం కోలుపోతుందని భరతుడి వల్ల విన్న పితృ మరణవార్త కూడా ధ్వనిస్తుంది.
Page 103