#


Index

వర్ణనా సామరస్యము

ముందు కనిపించింది దాని సంక్షుభితరూపమైతే ఇప్పుడు దాని స్తిమిత గంభీరమూర్తి. హనుమంతుడి వ్యవహారానికి తగినట్టే ఉందది. సీతా దర్శనార్థం వెళ్లే హనుమంతుడు వేరు. దర్శనానంతరం మరలి వచ్చే హనుమంతుడు వేరు. అప్పుడున్న సంభ్రమం ఇప్పుడు లేదాయనకు. అందుకే ఈ వర్ణనాద్వైవిధ్యం. ఇదే కుమార సంభవంలో కాళిదాస మహాకవి పుడికిపుచ్చుకొన్నాడు. హిమవత్పర్వత వర్ణన అంతా ఈ బాణీలోనే సాగింది. గురువుగారికి తగిన శిష్యుడేగదా.

  పర్వత వర్ణన తరువాత ఋతువర్ణన. ఇది మరీ అద్భుతం. అవిస్మార్యం. ఎంత అవిస్మార్యమంటే కాళిదాసులాంటి వాడినది శివమెత్తించి అతనిచేత పని గట్టుకొని ఋతు సంహారమనే ఒక ఖండ కావ్యమే వ్రాయించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా వ్రాస్తూనే ఉన్నారు ఋతువర్ణనలు కవి అని పేరు పెట్టుకొన్న ప్రతి ఒక్కరూ. ఆరు ఋతువులూ వర్ణించాడు వాల్మీకి రామాయణంలో. హేమంత ఋతువు అరణ్యకాండలో వస్తుంది. వసంతం కిష్కింధాదిలో వస్తుంది. మరి వర్షర్తువూ శరదృతువూ కిష్కింధ మధ్యంలో వస్తాయి. పోతే హేమంతంలో శిశిరమూ, వసంతంలో గ్రీష్మమూ, గతార్థమయినట్టుగా భావిస్తే మనం మహాకవి షడృతువులనూ వర్ణించినట్టే చెప్పుకోవచ్చు. ఈ ఋతు వర్ణనకూడా సంబంధమున్నా లేకున్నా ఏదో కావాలని వినోదార్ధం సాగించింది కాదు. తన వర్ణనా పాటవం చూపటానికి కాదు. ప్రతి ఒక్క మాటా అటు కథాగమనానికి ఇటు ఆయా పాత్రల ప్రవృత్తులకూ ఎంతో ద్యోతకంగానూ పోషకంగానూ కనిపిస్తాయి. ఇతివృత్తంతో అలా ఓతప్రోతమైన వర్ణనలివి. చూడండి. అరణ్యకాండలో హేమంతాన్ని వర్ణించాడు కవి. వర్ణన కుపక్రమిస్తూ ఇలా అంటాడు. అయం సకల స్సంప్రాప్తః ప్రియోయస్తే ప్రియంవద, అలంకృత ఇవాభాతి – యేన సంవత్సరశ్శుభః అప్పుడే శరత్కాలం పోయి హేమంతం వచ్చింది. ఆ సమయంలో ఒకనాటి ప్రభాతంలో గోదావరికి బయలుదేరారు సీతా రామలక్ష్మణులు. అప్పుడు రాముణ్ణి చూచి లక్ష్మణుడనే మాటలివి. సంవత్సరానికంతా అలంకారం లాంటిది హేమంత ఋతువు. ఈ ఋతువంటే నీకెంతో ఇష్టంకదా అంటాడు. చూడండి. ఈ మాట ఎంత సాభిప్రాయమైనదో. ఇన్ని ఋతువులుండగా హేమంతమొక్కటే అలంకారమెలా అయింది హేమంతమంటే చాలా చల్లని కాలం. ఎండలుండవు. వానలుండవు. చల్లగా సుఖంగా ఉంటాయి రోజులు. విశేషించి

Page 102

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు