సాంఖ్య యోగము
భగవద్గీత
నిజమే. ఆకాశాని కాత్మ కున్న లక్షణాలు చాలా వరకున్నాయి. సర్వగతః స్థాణుః అచలః అనే మూడు లక్షణాలూ దానికి సరిపోతాయి. ఆకాశం సర్వగతమే. సర్వత్రా పరుచుకొని కనిపిస్తుంది. స్థాణుః కదలకుండా స్థిరంగా ఉంది. అంతే కాదు అచలః వాయువు తేజస్సు - ఇలాంటి దేది దాన్ని కదిపినా కదలదు. కాని నిత్యః సనాతనః అనే రెండు లక్షణాలు లేవు దానికి. అది నిత్యం కాదు. సనాతనం కాదు. తస్మాదాత్మన ఆకాశః సంభూతః అని చాటిస్తున్నది తైత్తిరీయం. ఆకాశం కూడా ఆత్మ నుంచి జన్మించిందట. అంటే అర్ధం. చైతన్యమన్నింటికీ ప్రమాణ మయినట్టే ఆకాశముందని చెప్పటానికి కూడా అదే ప్రమాణం. ఆకాశాని కాకాశమే ప్రమాణం కాదు. కారణం అది జడ పదార్థం. తన అస్తిత్వాన్ని తాను గుర్తించలేదు. గుర్తించటాని కాత్మ చైతన్య మావశ్యకం. కనుక స్వతః ప్రమాణం కాదు కాబట్టి నిత్యం కాదది.
అలాగే సనాతనం కూడా కాదు. సనాతనమంటే మొదటి నుంచీ ఉన్నది నకారణా త్కుతశ్చి నిష్పన్నః అని అర్థం వ్రాశారు భాష్యకారులు. దాన్ని జన్మింప జేసే కారణమేదీ లేకపోతే అది సనాతనం Eternal. అలాంటిది స్వతః ప్రమాణమైన ఆత్మే కావాలిగాని మరేదీ కాదు. ఆకాశానికి కూడా అదే ప్రమాణ మన్నప్పు డాకాశం సనాతన మెలా కాగలదు. అదుందని చెప్పటానికి చైతన్య మవసరం గదా. మరి ఆత్మకో. అది ఉన్నట్టు దానికే తెలుసు. ఇంకొకటి అక్కరలేదు. కనుకనే సనాతన మది.
Page 101