అధిదేవత. హనుమంతుడు లంకలో ప్రవేశించబోతే అది మొదట ఎదురు నిలబడుతుంది. దాన్ని దెబ్బ తీశాడంటే దానితో లంకా పట్టణమే దెబ్బతిన్నదని అర్థం. అలాగే అయోధ్యను రాముడు వదిలిపోతే "తతస్త్వయోధ్యారహితా మహాత్మనా చచాల ఘోరంభయ శోకపీడితా సనాగయోధాశ్వ గణా ననాదచ” అని భయకంపితయై శోకంతో పలవిస్తూ బాధపడిందని వర్ణిస్తాడు కవి.
ఇలా అచేతనాలుగా కనిపించే ప్రకృతి దృశ్యాలలో చేతనత్వాన్ని దర్శించి వర్ణించటం, ఇది ఒక మహాద్భుతమైన చమత్కారం మహర్షుల వాఙ్మయంలో. ఈ సూత్రమే ప్రస్తుత మీ సముద్ర వర్ణనలో మనకు దాఖలా అవుతుంది. ఇది తరువాత యుద్ధకాండారంభంలో రాముడు వానర సైన్యంతో వచ్చి తీరంలో విడిసి ఉన్నప్పుడింకా అద్భుతంగా దాఖలా అవుతుంది. 'హసంత మివఫేనౌఘైః నృత్యంత మివ చోర్మిభిః' పినష్టీవ్ తరంగాగ్రైః సముద్రః ఫేనచందనమ్ తదాదాయ కరైరిందుర్లింపతీవ దిగంగనాః ముక్తాహారమివోర్మిభిః' నురుగులతో నవ్వుతున్నదట. అలలతో నృత్యం చేస్తున్నదట. అలలనే నురుగనే గంధాన్ని తీస్తుంటే ఆ గంధం దిక్కులనే కాంతల ముఖాలకు పూస్తున్నాడట చంద్రుడు. ఒక్కొక్క అలా ఒక్కొక్క తెల్లని ముత్యాల దండ సముద్రుడు తన మెడలో వేసుకొంటున్నట్టుందట. ఏమి మనోహరమైన అపూర్వమైన వర్ణన ఇది. సముద్రమా ఇది. సముద్రుడా రెండూ. మన దృష్టితో చూస్తే సముద్రం. కవి దృష్టితో చూస్తే సముద్రుడు. ఈ సముద్రుణ్ణి ఇంతగా వర్ణించాడంటే వాల్మీకి - ఇక్ష్వాకు వంశంతో సముద్రుడి కెంత సన్నిహితమైన సంబంధముందో వారి పనిచేసి పెట్టవలసిన బాధ్యత అతనికెలా ఉందో మనకు స్ఫురింపజేయటానికే.
ఇలాగే పర్వత వర్ణన కూడా చేశాడు మహాకవి. మొదట ఉత్తరం నుంచి దక్షిణపారం చేరటానికి మహేంద్రమనే పర్వతమెక్కాడు హనుమంతుడు. తరువాత సీతా సందర్శనానంతరం మరలా దక్షిణం నుంచి ఉత్తరతీరం చేరటానికి అరిష్టమనే పర్వతాన్ని ఆరోహిస్తాడు. ఆ రెండు పర్వతాలనూ వర్ణించాడు కవి. మొదట దాని అధిభౌతిక సౌందర్యాన్ని వర్ణిస్తే రెండవ మారు దాని ఆధ్యాత్మిక విభూతిని ప్రదర్శిస్తాడు. చూడబోతే హనుమంతుడి మూర్తినే స్ఫురింపజేస్తున్నాయా పర్వత మూర్తులు మనకు. సీతా దర్శనార్ధం వెళ్లేటప్పుడు హనుమంతుడెంతో సంభ్రమంతో కనిపిస్తాడు.
Page 100