#


Back

యోగ మంటే ఏమిటి?

యోగమనే మాట చాలా తరుచుగా మనం వినే మాటలలో ఒకటి. ఎంత తరుచుగా ఈ శబ్దం మన చెవిలో పడుతుంటుందో దాని అర్ధమంత అరుదుగా మనసుకు వస్తుంటుంది. ఖచ్చితంగా ఇదమిత్ధమని నిర్ణయించలేక పోతున్నాము. మీ యోగక్షేమాలు బాగున్నాయా అని అడుగు తుంటాము. వాడికి మంచి యోగం పట్టిందంటాము. వీడి యోగం బాగా లేదంటాము. ఇలాంటి లోక వ్యవహారం దగ్గరి నుంచి యోగాభ్యాసం యోగసిద్ది అనే శాస్త్ర వ్యవహారం వారకూ ఎంతైనా ఉంది దీని క్షేత్రం. ఎక్కడ ఏ అర్ధంలో వాడు తుంటామో ఈ శబ్దాన్ని మనకే తెలియదు. ఆ మాటకు వస్తే ప్రామాణికమైన గ్రంథాలలోనే అంతుపట్టని వ్యవహారమిది.

భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలకూ, పద్దెనిమిది యోగాలని పేరు పెట్టాడు వ్యాస భగవానుడు. చిత్రమేమంటే విషయాలెక్కడి కక్కడ మారుతున్నా అన్నింటినీ యోగమనే పేర్కొంటాడాయన. విషాదమూ యోగమే - కర్మా యోగమే జ్ఞాన విజ్ఞానాలూ యోగమే. అది ఎలా సంభవం. అంతే కాదు. మధ్యలో అక్కడక్కడా యోగ శబ్దానికి నిర్వచనం ఇస్తూ వచ్చాడు మహర్షి యోగః కర్మ సు కౌశలమ్ - పనులు చేయటంలో చాతుర్యమే యోగమంటా డొకచోట సమత్వం యోగ ఉచ్యతే సుఖదుఃఖాది ద్వంద్వాలను తేడా లేకుండా చూడటమే యోగమంటాడు మరొకచోట. యోగక్షేమం వహామ్యహమ్ యోగక్షేమాలు రెండూ ఇస్తానంటా డింకొక చోట. దుఃఖసంయోగ వియోగం యోగ సంఙ్ఞతమ్ దుఃఖయోగం లేకపోవటమే యోగమని చమత్కారంగా వర్ణిస్తాడొకచోట. పోతే జ్ఞాన యోగ వ్యవస్ధితిః అని వ్యాస భగవానుడు ప్రయోగిస్తే దానికి భగవత్పాదులు అర్ధం వ్రాస్తూ, జ్ఞానమంటే శాస్త్రజన్యమైన జ్ఞానమనీ, యోగమంటే అది స్వానుభవానికి తెచ్చుకోటమని వివరిస్తారు.

భగవద్గీత సంగతే ఇలా ఉంటే ఇక యోగ శాస్త్రమే ప్రత్యేకంగా రచించిన పతంజలి మహర్షి సంగతి చెప్పేదేముంది. షడ్దర్శనాలలో కపిలుని సాంఖ్యమొక దర్శనం. పతంజలి యోగ మొక దర్శనం. సాంఖ్యం నిరీశ్వర Atheistic మయితే యోగం సేశ్వరం. Theistric చాలా ప్రామాణికమైనది. పాతంజల యోగదర్శనం తరువాత వచ్చిన యోగ వాఙ్మయాని కంతటికీ మూలభూతమైనది. అందులో మొట్టమొదటనే యోగమంటే ఏమిటొ లక్షణం చెప్పాడాయన. "యోగశ్చిత్త వృత్తి నిరోధః" అని సూత్రం. మనసులో కలిగే భావాలన్నింటినీ అరికట్టి పారవేయటమే యోగమట. అది నెరవేరాలంటే యమ నియమాదుల దగ్గరి నుంచీ ధారణా, ధ్యాన, సమాధుల వరకూ అష్టాంగ యోగమనే పేరుతో ఎనిమిది భూమికలు వర్ణించి చెప్పాడాయన.

ఇంత మంది పెద్దలిన్ని మార్గాలలో వర్ణిస్తూపోయే సరికి యోగమనే మాట కసలైన అర్ధమేమిటా అని మనకిప్పుడు సందేహం. అన్నీ అర్ధాలేనని చెప్పటానికి లేదు. అవి పరస్పర విరుధ్ధంగా కనిపిస్తాయి. వైరుధ్యమున్నంత వరకూ సమన్వయ మేర్పడదు. సమన్వయం లేకుంటే నిశ్చయ జ్ఞానానికి నోచుకోలేము. నిశ్చయ జ్ఞానం లేకపోతే సాధన లేదు. సిద్ధి లేదు. అంచేత అన్నింటినీ కలిపి ముడిపెట్టి చూపే సమన్వయ సూత్రమేదైనా ఉందా అని విచరించా లిప్పుడు.

ఏ శబ్దమైనా ఉన్నదున్నట్టు మనకర్ధం కావాలంటే అది ఏ మూల ధాతువు నుండి వచ్చిందో దాన్ని పట్టుకోవాలి మనం. యోగమనే శబ్దం యుజ్ అనే ధాతువు నుంచి వ్యుత్పన్నమయింది. యుజ్ అంటే కలియటమని అర్ధం. అప్పటికి యోగ మంటే కలయిక అన్నమాట. రెండు పదార్ధలున్నప్పుడే కలయిక అనేది సంభవం. అందులో రెండూ అపరిపూర్ణమైతే కలిసి ప్రయోజనం లేదు. రెండూ పరిపూర్ణమైతే కలియ నక్కరలేదు. పోతే ఒకటి అపరిపూర్ణమై, మరొకటి పరిపూర్ణ మయినప్పుడే కలయిక కర్ధముంటుంది. "పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవావశిష్యతే" అన్నట్టు దానిలాగా ఇది పూర్ణమై మానవుడికి పూర్ణమైన తత్త్వం అనుభవానికి వస్తుంది. అదే జీవిత సమస్యలన్నింటికీ ఏకైకమైన పరిష్కారం.

కాగా ప్రస్తుత మా అపరిపూర్ణ మేమిటి. అది అందుకోవలసిన ఆ పరిపూర్ణమైన తత్త్వ మేమిటని ప్రశ్న. అపరిపూర్ణమేదో గాదు. మానవుడి మనస్సు. ఈ మనస్సుకు గోచరించే ప్రపంచమూ అపరిపూర్ణమే. అంతే గాదు. వీటి కతీతమని భావించే ఈశ్వరుడూ అపరిపూర్ణుడే. కారణం. ఇవన్నీ విశేష రూపాలు. విశేషమెప్పుడూ పరిచ్ఛిన్నం. వాటిని వ్యాపించిన సామాన్యమే పరిపూర్ణం. ఒక విశేషం నుంచి మరొక విశేషం రాదు. సామాన్యంలో నుంచే అన్ని విశేషాలు ఏర్పడుతుంటాయి. దానితోనే నిండి ఉంటాయి. అందులోనే మరలా లయమయి పోతాయి. కనుక సామాన్యం కంటే విశేషాలు వేరు కావు. సామాన్యమే మన దృష్టికి విశేషరూపంగా భాసిస్తుంటుంది. సువర్ణాభరణాదిదృష్టాన్తాలలో ఇది మనం చక్కగా అర్ధం చేసుకోవచ్చు. ఇంతకూ సామాన్యమే వస్తువు. విశేషాలన్నీ దాని ఆభాసే. కాబట్టి అపరిపూర్ణ మేదీ కాదు. అంతా పరిపూర్ణమే.

ప్రస్తుత మీ జీవజగదీశ్వరులనే మూడూ విశేషాలు గాబట్టి వాటిపాటికవి అపరిపూర్ణం. ఎలాగంటే జీవుడంటే అది చిద్వేశేషం దీనికి గోచరించే జగత్తు సద్విశేషం. పోతే ఈశ్వరుడు గోడమీద పిల్లి. చిద్విశేషమైతే జీవుడి పక్షం. సద్విశేషమైతే జగత్తు పక్షం. ఇలా మూడూ విశేషాలైతే ఇక వీటన్నిటినీ వ్యాపించిన సామాన్య మేమిటి. ’అహమస్మి’ నేనున్నానే స్ఫురణ అది. నేను ఫలానా అనుకోవటం కాదు కాబట్టి చిద్వేశేషం కాదది. చిత్సామాన్యం. అలాగే ఫలానాగా ఉండంటం కాదు కాబట్టి సద్విశేషం కాదు. సత్సామాన్యం. మూడింటినీ వ్యాపించిన సామాన్యం గాబట్టి దీనికి మహాసామాన్యమని పేరు పెట్టారు శాస్త్రజ్ఞులు. దీనికే ఆత్మ అని కూడా నామాంతరం. సచ్చిద్రూపమిది. ఇందులోనే జీవ జగదీశ్వరులనే విశేషాలు మూడూ తరంగ బుద్బుద ఫేనాలు సముద్రంలో మాదిరి చేరి ఏకమై పోతాయి. కాబట్టి ఇక అపరిపూర్ణమనే గంధం కూడా లేదు. అంతా గలిసి ఏకైకమైన పరిపూర్ణతత్త్వం.

ఇది మనకు లభిస్తే చాలు. అదే మనకు పట్టే యోగం. సామాన్య విశేషాలు రెండూ కలిసి ఏకమైన దశ కాబట్టి అదే సమత్వం. ఈ దృష్టితో ఏ పని సాగించినా అది బంధకం కాదు కాబట్టి అదే కర్మసు కౌశలం. ఇందులో ఇక విశేషాల తాలూకు వృత్తులన్నీ వాటి పాటికవే తొలిగిపోతాయి. కాబట్టి చిత్తవృత్తి నిరోధమూ ఇదే. ఆఖరుకిది పరోక్షంగా గ్రహిస్తే శాస్త్రజ్ఞానం. అపరోక్షంగా మారితే స్వానుభవం. ఇలాంటి పూర్ణమైన ఆత్మానుభవంలో అనాత్మ రూపమైన అనర్ధం లేదు కాబట్టి ఇదే పురుషార్ధం కూడా.

***