నామం | అంతరార్థము |
---|---|
మహోదధిశయః అంతకః |
మహోదధి గంభీరమైన యోగమాయే. దాని నదిశయించిన తత్త్వమది. దానికి కూడా అంతం. అవధి భూతమది. |
అజః మహార్హః స్వాభావ్యః జితామిత్రః ప్రమోదనః |
జన్మించకనే మహార్హ-విలువైన పదార్ధమది. దానికి వెలగట్టే వస్తువు మరొకటి లేదు గదా. స్వాభావ్య-తనపాటికి తాను స్వభావ సిద్ధంగా ఉన్నదది. తన పాటికి తానున్నది గనుకనే విజాతీయమైన శత్రువర్గం లేదు దానికి. అంటు సొంటులను జయించినది. అందుకే నిత్యప్రమోద శీలం. |
ఆనందః నందనః అనందః |
ఆనందరూపమే అది. తన ఆనందాన్నే ముక్తుల కందజేస్తుంది. సిద్ధులకు తప్ప బద్ధులైన వారికందదా ఆనందం. వారి పాలిటికది అనందం. |
సత్యధర్మా త్రివిక్రమః |
అది తాను ఉంటూ తతిమా వాటినన్నిటినీ ధర్మ - ధరించి ఉన్నది. దేశకాల వస్తువులను మూడింటినీ (త్రి) విశేషంగా (వి) ఆక్రమించి (క్రమ) ఉన్నది. |
మహర్షిః కపిలాచార్యః |
తన చైతన్య దర్పణంలోనే సమస్తమూ (ఋషి) చూస్తున్నది. కపిలుడనే మహర్షిగా అవతరించి ముముక్షువులకు జ్ఞానోపదేశం చేసింది. సగరపుత్రులను దగ్ధం చేసిన అవతారమిది. సాంఖ్యమత ప్రవర్తకుడు కాదు. |
కృతజ్ఞః మేదినీపతిః |
స్వకృతమైన సృష్టినంతా గమనిస్తున్నది. మేదినీ-వైఖరీ రూపంగా వ్యాపించిన మాయాశక్తిని పాలిస్తున్నది. |
త్రిపదః త్రిదశాధ్యక్షః |
స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలనే మూడుస్థానాలు కలిగి జాగ్రదాదులైన మూడు దశలకూ సాక్షి అయి ఉన్నది. |
Page 42