#


Index

శ్రీ విష్ణు సహస్రనామ అంతరార్థము
నామం అంతరార్థము
శూరః
జనేశ్వరః
పరమాత్మ నిత్యముక్తుడు కాబట్టి ఎప్పుడూ శూరుడే. ఆ శూరుడి వల్ల తరించాడు కాబట్టి జీవుడు శౌరి. కాగా ఇద్దరూ జనేశ్వరులే. జన్మ కతీతులే.
అనుకూలః
శతావర్తః
కూలాన్ని అనుసరిస్తూ తనలోనే శతావర్తాలు (సుళ్ళు) తిరుగుతున్న మహా చైతన్యసాగరమది.
పద్మీ
పద్మనిభేక్షణః
భూర్భువస్సు వరాదులైన పద్మాలే ఆవర్తాలు. అన్నీ ఆయన ధరించినవే. ధరించాడనేది కూడా ఒక నిభం, నెపం. అవి ఆయన ఈ క్షణం వల్ల ఏర్పడే ఆభాసలే.
పద్మనాభః
అరవిందాక్షః
పద్మగర్భః
శరీరధృత్
ఈ పద్మాలన్నీ అసలా చైతన్యంలోనే గుప్తమై ఉన్నాయి. అది నాభి వీటికి. దాని వీక్షణంవల్ల అరలరలుగా వింద విచ్చు కొన్నాయి. అలా విచ్చిన పద్మాల గర్భంలో తానే వచ్చి అంతర్యామి రూపంగా ప్రవేశించాడు. ప్రవేశించి శీర్ణమవుతున్న ఈ శరీర పద్మాలను విరిసిపోకుండా ధరించాడు.
మహర్థిః
ఋద్ధః
వృద్ధాత్మా మహాక్షః
గరుడధ్వజః
ఋద్ధి అంటే సంపత్తి. ఇంతటి మహాసంపద ఉందా చైతన్యంలో దానితో అది ఎప్పుడూ సమృద్ధమే. అది ఇక వర్ధిల్లనక్కరలేదు. ఇతః పూర్వమే వృద్ధమయి ఉంది. అక్షమంటే ఇరుసు. అది ఒక పెద్ద ఇరుసు ఈ సంసార చక్రానికి, నిత్యమూ రాకపోకలు చేసే ఈ ప్రాణమనే గరుత్మంతుడే దానికి ధ్వజం. దాని ప్రభావాన్ని మనకు సూచించే సంకేతం.
అతులః
శరభః
భీమః
దానికి సూచకమైన ఈ కాలం కూడా దాన్ని తూకం వేయలేదు. తుల తూగనిదది. ఒక శరంలాగా ఈ కాలాన్నికూడా ఛేదించ గలదు. అతిభయంకరమైనదా తత్త్వం.

Page 32

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు