#


Back

వినాయక చతుర్థి

ప్రతి సంవత్సరమూ భాద్రపద శుద్ధ చవితినాడు మనం వినాయకుడి పూజ చేసుకొంటాము. మనకంటే శక్తిమంతులైన దేవతలనారాధిస్తే వారు ప్రసన్నులయి మన కోరికలు సఫలం చేస్తారని నమ్మకం. ఇంకా తీవ్రంగా వారి నుపాసన చేస్తే దేహ పాతానంతరం వారి లొకాలకే పోయి వారి సాయుజ్యమునే చెందుతామని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. వినాయకుడు కూడా ఒక దేవతే. దేవతే కాదు, దేవతా జ్యేష్ఠుడు. వాగీ శాద్యా స్సు మనసః సర్వార్థానా ముపక్రమే యం నత్వా కృత కృత్యాః స్యుః అని ఆర్యోక్తి. బ్రహ్మదేవుడు మొదలు సమస్త దేవతలూ ఏపని మొదలుపెట్టినా మొదట వినాయకునికి మ్రొక్కుబడి చెల్లిస్తే గాని కృతార్ధులు కాలేరట. దేవతల మాటే ఇలా ఉన్నప్పుడిక మానవుల మాట చెప్పేదేముంది. అంచేత త్రిలోకవాసులకూ పూజనీయుడీ వినాయకుడు. కనుకనే అటు వైదికులకూ ఇటు తాంత్రికులకూ కూడా ఆరాధనీయుడయ్యాడు. గణానాం గణపతిగ్ం హవాహమే - అని ఋగ్వేదమే ఘోషిస్తున్నదాయన మాహాత్మ్యాన్ని. పోతే తాంత్రిక వాఙ్మయంలో ఈ దేవత అన్నింటికీ మూలాధారమయి కూచున్నది.

అసలెందుకింత ప్రాధాన్యమిచ్చారీ దేవతకు. ఆయన పేరే చెబుతున్నది మనకు సమాధానం. వినాయకుడంటే వినయం చేసేవాడు. వినయనమంటే శిక్ష. అందరనీ శిక్షించి వారిని సన్మార్గంలో నడిపేవాడని అర్థం. ఎవరా అందరూ. ప్రమథ గణాలు. మనస్సును దుష్ట భావాలతో మధిస్తాయి కాబట్టి ప్రకృతి శక్తులకే ప్రమథ గణాలని పేరు. వాటినిలా విచ్చలవిడిగా తిరగకుండా సాధకులను బాధించకుండా వాటి నదుపులో పెట్టుకొని ఆధిపత్యం వహించే మహాశక్తి ఏదుందో అది గణపతి - గణేశుడు. గణాల కధిపతి అని అర్థం. దానివల్ల ఒక సత్కార్యానికెప్పుడూ అంతరాయం కలిగే ప్రమాదం లేదు కాబట్టి విఘ్ననాయకుడు - విఘ్నేశుడని కూడా సార్ధకంగా ఏర్పడిందాయనకు. సత్త్వరజస్తమోగుణాలే అసలు గణాలు. ఇవే నిర్గుణమైన జీవచైతన్యాని కడ్డు తగిలి అతని కార్యాలకు ఫలసిద్ధి లేకుండా చేస్తున్నాయి. వీటిలో దేవతలు సత్త్వానికీ, మానవులు రజస్సుకూ, రాక్షసులు తమస్సుకూ లోనయన వారు కాబట్టి వాటి బారి తప్పించుకోవాలంటే వాటిని నివారించే ఒక మహాశక్తిని వారాశ్రయించి తీరాలి. వారంటే ఎవరో కాదు మరలా ఆ ముగ్గురూ. ముగ్గురూ కలిసి నిజానికి మానవులే. ఎందుకంటే సాత్త్విక రజస తామస గుణాలున్నవారు మన అనుభవంలో మానవులే గదా. అంచేత వీరే ఆ మహాశక్తి నారాధించాలి. ఆ మహాశక్తే వినాయకుడు.

శక్తి అంటే అది ఒక అమూర్తం. దాన్ని మనసుకు తెచ్చుకోవటంగాని ఆరాధించటంగాని అంత సులభం కాదు. కాబట్టి మానవుడు దానికొక మూర్తి కల్పన చేసాడు. మట్టితో ఒక విగ్రహం తయారు చేసాడు. దానికొక ఏనుగుతల, ఏనుగుశరీరం తెచ్చి పెట్టాడు. ఒక మూషికాన్ని దానికి వాహనం చేసాడు. రకరకాల ఆకులూ, కాయలూ పండ్లు తీసుకువచ్చి దాని కాహారం పెట్టాడు. పోతే ఆ దేవత మీద భక్తి శ్రధ్ధలెక్కువ చేయటానికెన్నో కథ లాయనకు ముడిపెటి వర్ణించాడు. పార్వతీపరమేశ్వరుల ముద్దు బిడ్డ వినాయకుడు. తండ్రి కోపానికి గురి అయి శరీరం కోలుపోయి మరలా ఆయన అనుగ్రహంతో గజ శరీరుడయ్యాడు. ఒక దంతం - ఒక తొండం - ఒక పెద్ద బొజ్జ ఏర్పడ్డాయి. కుడుములు తినటానికి క్రిందికి వంగబోతే పొట్ట వంగ లేదు. అది చూచి చంద్రుడు నవ్వితే వాణ్ణి శపిస్తాడు వినాయకుడు. చవితినాడు తన పూజ చేసుకుంటే ఆ చంద్రుణ్ణి చూచినా వారికి నీలాపనిందలు రావని అనుగ్రహిస్తాడు. లేకుంటే కృష్ణ పరమాత్మ అయినా ఆరడిపాలు కావలిసిందే తప్పదు.

ఒకనాడీ వినాయకుడు తల్లిదండ్రులకు సమస్కరించి నాకు పెళ్ళిచేస్తారా లేదా అని మారాము చేసాడట. బాబూ మీ అన్న కుమారస్వామికి కూడా కాలేదు పెండ్లి. ఇద్దరిలో ఎవరు ముందుగా ఈ భూమిని చుట్టి వస్తే వారికి చేస్తామని మాట ఇచ్చారట. అది విని కుమారుడు మయూరవాహనం మీద భూమండలమంతా పరిభ్రమించటానికి బయలుదేరాడు. వినాయకుడు తన మూషికం మాట వినక పోవటంతో, చేసేది లేక తల్లిదండ్రులను చెరొకవైపు పీట మీద కూచోబెట్టి మూడుసార్లు వారి చుట్టూ ప్రదక్షిణం చేసి ఇదే భూప్రదక్షిణం, ఇక చేయమన్నాడట వివాహం. దానికి వారు సంతోషించి సిధ్ధి, బుధ్ధి అనే ఇద్దరు కన్యలను తెచ్చి అంటగట్టారట ఆయనకు.

ఏమిటి కథలన్నీ ఏమి చెబుతాయి మనకు. నేను మొదటనుంచీ మనవి చేస్తూనే వచ్చాను. పురాణ కథలన్నీ సంకేతాలని. సంకేతాలన్నీ ఒక సత్యాన్ని చెప్పటానికి ఏర్పడతాయి. వినాయకుడు గణనాధుడంటే ఈ దేహేంద్రియాది గణాన్నిదగ్గర బెట్టుకొన్నజీవుడే. వీడీ గణానికి లోనైతే జీవితమంతా విఘ్నాలే. లోనుగాక ఏమవుతాడు మరి దేహమే నేననే అహంకారం దగ్గరుంటే. అహంకారానికి చిహ్నమే గజశరీరం. తుండం జీవుడి ముఖమే. అది ఆహారంగా తీసుకొనేది ఈ ప్రాపంచకమైన నామరూపాలే. అవే పత్రపుష్పఫలాదులు. పృథివి వికారమే ఇదంతా. దానికి సూచకమే పార్థివమైన విగ్రహం. భౌతికమైన శబ్దస్పర్శాదులతోనే పొట్ట పెంచుకొన్నాడీ జీవుడు. చెవులు పెద్దవి కనులు చిన్నవి. శ్రవణమే గాని దర్శనం లేదు. దానికి తోడు మూషిక వాహనం. చాపల్యానికి చిహ్నమది. ఎప్పుడూ విషయ జగత్తు మీద ప్రాకులాట. ఒకే ఒక దంతం. అదీ ఊర్ధ్వముఖం కాదు, అథోముఖం. చూపు ప్రపంచం మీదనే గాని పరమార్థం మీద లేదు. మరి చంద్రుడు నవ్వక ఏమి చేస్తాడు. చంద్రుడు మనస్తత్త్వమే అది. మన దృష్టి ప్రాపంచకమైతే మనల నపహసిస్తూనే ఉంటుంది.

మనస్సును జయించినవాడే మానవుడు. మానవుడు మానవోత్తముడయి మానవాతీతమైన భూమిక నందుకోవాలి. అప్పుడే గణాధీశుడనిపించుకొంటాడు. ఎలాగ అది. భద్రమైన పదం భాద్రపదం. అది శుద్దం. చతుర్థి కూడా అదే. అవస్థాత్రయాన్ని దాటిన తురీయ స్థితి. అది అహంతా రూపమైన గజ శరీరాన్ని, మమతారూపమైన మూషికాన్ని గాక ఊర్ధ్వ దిశగా సాగిన తుండాగ్రం మీద దృష్టి నిలిపినపుడే దక్కుతుంది. ప్రణవ స్వరూపమా వక్ర తుండం. ప్రణవం అకారాది రూపమైన వర్ణత్రయం కాదు. తదతీతమైన అమాత్రరూపమైన తురీయం. తద్ద్వారా దాన్ని అందుకోగలిగితే సాధకుడా అందుకొనే అఖండాకార వృత్తే బుద్ధి. దాని వలన లభించే నిర్వాణ సుఖమే సిద్ధి. మోక్ష సాధకుడైన జీవుడనే గణపతికి అవి రెండూ అధీనం కాగలవు. అయితే అప్పుడిక ఏ చంద్రుడు అతణ్ని చూచి నవ్వలేడు. చంద్రుడంటే మనసే గదా. మనస్సు కతీతమయ్యాడు గణపతి. మనసెక్కడిది ఇక నవ్వటానికి. కాని ఆ తురీయ స్థితి నందుకొని కూడా చాపల్యంతో మరలా దాని నక్కడా భావిస్తే మాత్రం నవ్వటమే గాక నీలాపనిందలూ వస్తాయి. నీలాపనిందలీ ప్రపంచ సుఖదుఃఖాలే. పరమాత్మ అయినా ఆ స్థితి నుంచి దిగజారాడంటే తప్పవా మానసికానుభావాలు. కనుకనే చవితినాడు చంద్రుణ్ణి చూడరాదు. అలాగైతేనే గణాధీనుడైన ఈ జీవుడు గణాధీశుడయి చతుర్థమైన తన సహజ స్ధితిని కాపాడుకొని విఘ్నాలన్నిటినీ రూపుమాపి భద్రమైన, శుద్ధమైన మోక్ష సుఖాన్ని పడయగలడు.

అప్పుడది నిజంగా శుక్లాంబరధరం. శుక్లమైన అంబరమంటే చిదాకాశం. దాన్ని ధరించిన వాడవుతాడు మానవుడు. చిదాకాశ రూపుడయ్యాడంటే విష్ణుమ్ - దేశకాలవస్తువులను మూటినీ వ్యాపిస్తాడు. వస్తుతః నిర్వికల్పరూపుడైనా శశివర్ణం - సవికల్పమైన మనోభూమికలో కూడా వర్తించగలడు. శశి అంటే మనస్సే. మొదటిది స్వరూపస్ధితి అయితే రెండవది తన విభూతి. దానితో చతుర్భుజమ్ - ధర్మజ్ఞానవైరాగ్యైశ్వరాలనే సిధ్ధి చతుష్టయాన్ని యధేచ్ఛగా భుజించగలడు. అది మరలా గురురూపుడయి శిష్య వర్గానికందించగలిగితే ప్రసన్నవదనుడనిపించుకొంటాడు. శ్రధ్ధాళువులైన శిష్యులకు ప్రసన్నుడయి వదన - బోధిస్తాడని అర్ధం. అలాటి గురుమూర్తి అయిన మహాగణపతిని ధ్యాయేత్ - ముముక్షువులమైన మనమంతా నిత్యమూ ధ్యానిస్తూ పోవాలి. పోతే సర్వ విఘ్నోపశాంతయే - సాధన మార్గంలో మనకు కలిగే విఘ్నాలన్నీ పటాపంచలవుతాయి. విఘ్నాలీ నామరూపాలే. వీటి తాలూకు మనోవృత్తులే. అవి రెండూ నిర్మూలమైతే మిగిలేది మనకిక పరిశుద్ధమూ పరిపూర్ణమైన స్వరూపమే.

***