×
విద్యా/విద్వాన్: 'వేత్తి అనయా ఇతి విద్యా.' దేని మూలంగా ఒక సత్యాన్ని గ్రహిస్తామో అది విద్య. అది రెండు విధాలు. పర అపర. ఋగ్వేదాది వాఙ్మయమంతా అపర. పోతే అక్షరమైన అద్వైత తత్త్వాన్ని బోధించేదొక్కటే, పర. అది కేవలం బ్రహ్మజ్ఞానమే. ఇలాంటి విద్యనందుకొన్నవాడు విద్వాన్. అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. The realized person. విద్య అంటే బ్రహ్మవిద్యే కాక ఉపాసనకు కూడా పేరుంది. మధువిద్య, పర్యంక విద్య, పంచాగ్ని విద్య అని ఇలాంటివెన్నో విద్యలు ఉపనిషత్తులలో కనపడతాయి. ఆ సందర్భంలో వాటికి ఉపాసన అనే అర్థం చెప్పాలి కాని బ్రహ్మజ్ఞానమని చెప్పరాదు. ఈశావాస్యంలో 'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృత మశ్నుతే' అనేచోట విద్య అవిద్య అని రెండు మాటలు దొర్లాయి. ఇవి జ్ఞానం, అజ్ఞానమని బోల్తాపడే ప్రమాదముంది. అందుకే అవిద్య అంటే విద్యకానిది కర్మ అని, విద్య అంటే కర్మకంటే హెచ్చుస్థాయిలో ఉన్న ఉపాసన అని అంటే దేవతాజ్ఞానమని అర్థం చెప్పారు భగవత్పాదులు.